జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిడిపి పోటీ: చంద్రబాబు

November 08, 2020


img

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో టిడిపి క్రమంగా కనుమరుగైపోయింది. ఆ తరువాత ప్రతిపక్షాలతో కలిసి అప్పుడప్పుడు ప్రజా సమస్యలపై పోరాటలలో పాల్గొంటూ రాష్ట్రంలో టిడిపి ఇంకా ఉందని తన ఉనికి చాటుకోవడం తప్ప ఏ ఎన్నికలలోను ఒంటరిగా పోటీ చేయలేని దుస్థితికి చేరుకొంది. 2018 శాసనసభ ఎన్నికలలో తన బద్ద శత్రువైన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పోటీ చేసినప్పటికీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. పైగా టిడిపితో చేతులు కలిపినందుకు కాంగ్రెస్ పార్టీ కూడా మునిగిపోయింది. 

ఈ పరిస్థితులలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు త్వరలో జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు టిడిపి సిద్దం కావాలంటూ ఆదేశించడం విశేషం. 

చంద్రబాబునాయుడు నిన్న టిటిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, ఆనాడు తన హయంలో అనేక ఐ‌టి కంపెనీలను రప్పించి హైదరాబాద్‌ నగరాన్ని ఐ‌టి కేంద్రంగా మార్చినందునే ఇప్పుడు అమెజాన్ వెబ్‌ సర్వీసస్ వంటి పెద్ద కంపెనీలు వస్తున్నాయని అన్నారు. అభివృద్ధి చేసిన చోట ప్రజలను ఓట్లు అడిగే హక్కు  టిడిపికి ఉందని కనుక జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తెలంగాణ టిడిపి సిద్దం కావాలని కోరారు. హైదరాబాద్‌లోని వరద బాధితులను ఆదుకోవడంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కనుక ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికలలో పోరాడాలని చంద్రబాబునాయుడు కోరారు.

అపార రాజకీయానుభవం కలిగిన చంద్రబాబునాయుడుకి తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పరిస్థితి తెలియదనుకోలేము. కానీ హైదరాబాద్‌ వరదబాధితులను ఆదుకోవడంలో టిఆర్ఎస్‌ ప్రభుత్వం విఫలమైంది కనుక ప్రభుత్వం పట్ల వారికి ఏర్పడిన వ్యతిరేకతను టిడిపి ఉపయోగించుకోవాలని ఆయన ఆశిస్తున్నట్లు అర్ధమవుతోంది. అయితే హైదరాబాద్‌ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ వరదలతో అల్లాడుతున్న ప్రజలకు ఎటువంటి సాయం చేయలేదు. కనీసం వారి కష్టాలపై మాట్లాడేందుకు సాహసించలేదు. కానీ ఇప్పుడు వారి ఓట్లను ఆశిస్తున్నారు. అది సాధ్యమేనా? 


Related Post