కిషన్‌రెడ్డి చొరవతో తెలంగాణకు రూ.222.25 కోట్లు విడుదల

November 07, 2020


img

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చొరవ తీసుకొని కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు రూ.222.50 కోట్లు విడుదల చేయించారు. ఈ విషయం ఆయన స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. అర్బన్ లోకల్ బాడీ గ్రాంట్స్ క్రింద 10 లక్షలకు లోపు, ఆపైన జనాభా ఉన్న నగరాలకు కేంద్రప్రభుత్వం 222.25 కోట్లు విడుదల చేసింది. ఇందులో తెలంగాణలోని పది లక్షలలోపు జనాభా ఉన్న నగరాలకు రూ.105.25 కోట్లు, అంతకు మించి జనాభా ఉన్న హైదరాబాద్‌ నగరానికి  రూ.117  కోట్లు ఉన్నాయి,” అని ట్వీట్ చేశారు. దీని కోసం మంత్రి కిషన్ రెడ్డి పలుమార్లు సంబందిత శాఖ అధికారులతో చర్చలు జరిపారని, ప్రధాని కార్యాలయానికి కూడా తెలంగాణ వరదనష్టం గురించి నివేదిక ఇచ్చారని బిజెపి తెలిపింది. నిజానికి 2021 ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఈ నిధులు విడుదల కావలసి ఉండగా మంత్రి కిషన్ రెడ్డి ఒత్తిడి కారణంగానే ముందుగా విడుదలైనట్లు బిజెపి తెలిపింది. దీంతో రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలలో బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టవచ్చని కిషన్ రెడ్డి అన్నారు.  

 అయితే గత నెల 16న సిఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని వివరిస్తూ రాష్ట్రానికి అత్యవసరంగా రూ.1,350 కోట్లు మంజూరు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని ఓ లేఖ ద్వారా కోరారు. దానిలో రూ.600 కోట్లు రైతులకు పంటనష్టం చెల్లింపులకు, మిగిలిన సొమ్మును జీహెచ్‌ఎంసీ, పరిసర ప్రాంతాలలో పునరావసం, మౌలికవసతుల పునరుద్దరణ, నష్టపరిహారాల కోసం వినియోగిస్తామని సిఎం కేసీఆర్‌ లేఖలో తెలిపారు. కానీ సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తిపై కేంద్రం స్పందించలేదు. అందుకే దుబ్బాక ఉపఎన్నికలలో కేంద్రంపై టిఆర్ఎస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. జి.కిషన్‌రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం హైదరాబాద్‌ వచ్చిపోతుంటారే తప్ప కేంద్రం నుంచి నిధులు తీసుకురారని టిఆర్ఎస్‌ నేతలు ఎద్దేవా చేశారు. వారికి దీంతో కిషన్ రెడ్డి సమాధానం చెప్పగలిగారని భావించవచ్చు. కానీ సిఎం కేసీఆర్‌ రూ.1,350 కోట్లు అడిగితే కేంద్రం కేవలం 225.25 కోట్లు మాత్రమే విదిలించిందని టిఆర్ఎస్‌ నేతలు మళ్ళీ విమర్శించకుండా ఉండరు. కేంద్రం ఇచ్చిన దానికంటే రెట్టింపు అంటే రూ.550 కోట్లు తమ ప్రభుత్వమే హైదరాబాద్‌ వరదబాధితులకు మంజూరు చేసిందని ఆక్షేపించవచ్చు కూడా.



Related Post