బైడెన్ ఆనందం... ట్రంప్‌ ఆక్రోశం

November 07, 2020


img

అధ్యక్ష ఎన్నికలలో తప్పకుండా గెలిచి మళ్ళీ అమెరికా పగ్గాలు చేపడతానని గట్టి నమ్మకంతో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌ అనూహ్యంగా ఓటమికి దగ్గరలో ఉండగా, ఆయన ధాటికి ఎదురు నిలవలేరని భావించిన జో బైడెన్‌ విజయపధంలో దూసుకుపోతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న డోనాల్డ్ ట్రంప్‌ తన ఆక్రోశాన్ని ట్వీట్ల ద్వారా బయటపెట్టుకొంటున్నారు.

‘ప్రజాస్వామ్య రాజ్యంలో వక్రమార్గంలో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవాలని జో బైడెన్‌ ప్రయత్నిస్తున్నారు. బైడెన్‌...తప్పుడు మార్గంలో అధ్యక్షుడిగా ప్రకటించుకోకూడదు. అలా చేయదలిస్తే నేను కూడా చేయగలను. చట్టపరమైన ప్రక్రియ ఇప్పుడే మొదలైంది..,” అని ట్వీట్ చేశారు. 

అధ్యక్ష పీఠానికి కేవలం 6 ఓట్ల దూరంలో ఉన్న జో బైడెన్‌, “ఇంకా పూర్తి ఫలితాలు వెలువడలేదు. కానీ ఇప్పటివరకు గెలుచుకొన్న ఓట్ల సంఖ్యను బట్టి మనం కనీసం 300 ఓట్లతో ఘనవిజయం సాధించబోతున్నామని భావిస్తున్నాను. ఐదు కీలక రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో మనం ముందంజలో ఉన్నాము,” అని అన్నారు. 

తన విజయంపై జో బైడెన్‌ స్పందిస్తూ “గత 24 ఏళ్ళలో ఆరిజోనాలో మొట్టమొదటిసారిగా గెలిచిన మొదటి డెమొక్రాట్లం మనమే. అదేవిధంగా గత 28 ఏళ్ళలో జార్జియాలో గెలిచిన మొదటి డెమొక్రాట్లం మనమే. నాలుగేళ్ళ క్రితం కూలిపోయిన బ్లూ-వాల్‌ (డెమొక్రాట్ పార్టీ రంగు నీలం)ను మళ్ళీ మనం పునర్నిర్మించగలిగాము,” అని ట్వీట్ చేశారు.     

తాజా సమాచారం ప్రకారం ఆరిజోనా, జార్జియా, పెన్సల్వేనియా రాష్ట్రాలలో జో బైడెన్‌ ఆధిక్యంలో కొనగుతున్నారు. ఈ మూడు రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో జో బైడెన్‌ విజయం సాధించినా అమెరికా అధ్యక్ష పీఠం ఆయనదే. అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవాలంటే కనీసం 270 ఓట్లు సాధించవలసి ఉంటుంది. ప్రస్తుతం జో బైడెన్‌ 264 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకోగా, ట్రంప్‌ 214 వద్దే ఆగిపోయారు. మరో 24 గంటలలో ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Related Post