దయనీయ స్థితిలో ట్రంప్‌!

November 07, 2020


img

అమెరికా అధ్యక్షుడు అంటే అందరివాడు కావాలి కానీ డోనాల్డ్ ట్రంప్‌ ఎవరికీ కానివారయ్యారు. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. దేశంలో మీడియా, టెక్నాలజీ కంపెనీలు, ఎన్నికల సిబ్బంది అందరూ తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ తనను ఓడించాలని ప్రయత్నిస్తున్నారని ట్రంప్‌ అన్నారు.

 ‘నిజాయితీగా ఓట్లను లెక్కిస్తే నేనే గెలుస్తాను కానీ ఎన్నికల సిబ్బంది కూడా నిజాయితీగా తమ విధులు నిర్వర్తించడం లేదు,’ అంటూ వారిపై కూడా ట్రంప్‌ అనుమానాలు వ్యక్తం చేసారు. వైట్‌హౌస్‌లో ఆయన ఈ ఆరోపణలు చేస్తుంటే అవి నమ్మశక్యంగా లేవంటూ ఎన్‌బీసీ, ఏబీసీ, సీబీఎస్ న్యూస్ ఛానల్స్ మద్యలోనే మైక్ కట్ చేసి ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేశాయి. ఒక దేశాధ్యక్షుడికి ఇంతకంటే అవమానం ఏముంటుంది? 

అలాగే ట్రంప్‌కు కోర్టులలో తిరస్కారం ఎదురవుతోంది. ఇవన్నీ ఆయన స్వయంకృతాపరాధాలే అని చెప్పక తప్పదు. ‘తమ దేశపు ఎన్నికల ప్రక్రియపై నమ్మకంలేని ఓ దేశాద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌’ అని అమెరికన్లే కామెంట్స్ చేస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. 

ఓటమి అంచున ఉన్న డోనాల్డ్ ట్రంప్‌ హుందాగా మాట్లాడి తప్పుకొని ఉండాలి. కానీ తన ఓటమిని అగీకరించబోనని, న్యాయపోరాటాలు కొనసాగిస్తానని చెప్పడంతో వైట్‌హౌస్‌ ఖాళీ చేయబోనని సంకేతాలు పంపడం జో బైడెన్‌ వర్గానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది. బైడెన్‌ ప్రచారకమిటీలో ముఖ్య ప్రతినిధి ఆండ్రూ బెట్స్ స్పందిస్తూ, “ఎన్నికలలో విజేతను నిర్ణయించేది ప్రజలేనని మొదట్లోనే చెప్పాము. నేటికీ మేము ఆ మాటకే కట్టుబడి ఉన్నాము. కానీ ఓడిపోయినవారు వైట్‌హౌస్‌ను వీడకపోతే వారిని మెడ పట్టుకొని బయటకు పంపే బలమైన వ్యవస్థ మనకుంది,” అని ఘాటుగా స్పందించారు.

ఓటమి అంచున ఉన్న ట్రంప్‌ అన్ని వర్గాలపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటే, విజయపధంలో దూసుకుపోతున్న జో బైడెన్‌ మాత్రం చాలా హుందాగా మాట్లాడుతున్నారు. డెలావర్‌లో జో బైడెన్‌ తన అభిమానులను, ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కొంత గజిబిజి ఉంటుంది. కనుక ప్రతీ ఒక్కరికీ కొంత ఓర్పు అవసరం. ఆ ఓర్పే 240 ఏళ్ళుగా మన దేశాన్ని నడిపిస్తోంది. ఈ దేశంలో ప్రతీ పౌరుడి ఓటు కూడా చాలా ముఖ్యమైనదే... చాలా పవిత్రమైనదే కనుక చివరి ఓటు వరకు తప్పనిసరిగా లెక్కించి కౌంటింగ్ ప్రక్రియను పూర్తిచేయాలి. అదే మనదేశ ప్రజాస్వామ్య విధానం. ఈ అత్యున్నత ప్రజాస్వామ్య ప్రక్రియలో పోటీ పడిన మనం తప్పకుండా గెలుస్తామనే నమ్మకం నాకుంది,” అని అన్నారు. 

ట్రంప్, బైడెన్ ఇద్దరి మాటలు వింటే ఇద్దరి వ్యక్తిత్వాలలో ఎంత తేడా ఉందో అర్ధమవుతోంది. తన కోపమే తన శత్రువు అని మన పెద్దలన్నారు. ట్రంప్‌కు అది అక్షరాల వర్తిస్తుందని చెప్పవచ్చు. ఆయనకు శత్రువు జో బైడెన్‌ లేదా మరొకరో కాదు...ఆయన అహంభావం ఆయన నోటి దురుసే అని చెప్పకతప్పదు. ట్రంప్‌ ఎన్ని మంచి పనులు చేసినా అవన్నీ ఈ రెండు దుర్గుణాలతో కనబడకుండాపోయాయి. అందుకే ట్రంప్‌కు ఈ దుస్థితి ఎదురైందని చెప్పవచ్చు.


Related Post