ట్రంప్‌పై జెపినడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు

November 06, 2020


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో వెనకబడిపోయి న్యాయపోరాటాలు చేస్తున్న డోనాల్డ్ ట్రంప్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

బిహార్‌లో దర్భాంగా జిల్లాలో ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ, “ట్రంప్‌ ప్రస్తుత పరిస్థితి స్వయంకృతాపరాధమే అని చెప్పవచ్చు. కరోనాను ఎదుర్కోవడం ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారు. అందుకే అమెరికాలో లక్షాలాదిమంది కరోనా బారినపడ్డారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ 135 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో ప్రధాని నరేంద్రమోడీ కరోనాను చాలా సమర్ధంగా కట్టడి చేశారు. ఎంతో పకడ్బందీగా వ్యవహరిస్తూ దేశాన్ని, ప్రజలను కరోనా నుంచి కాపాడారు. ఇది సామాన్యమైన విషయమేమీ కాదు. భారత్‌లో ప్రధాని నరేంద్రమోడీ చేసి చూపింది అమెరికాలో ట్రంప్‌ చేయలేకపోయారు. ఆ వైఫల్యమే ట్రంప్‌ ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణమని చెప్పవచ్చు,” అని అన్నారు. 

భారత్‌లో 135 కోట్లకు పైగా జనాభా ఉంది. వారీనందరినీ కరోనా నుంచి కాపాడటం భారత్‌ వంటి దేశానికి చాలా కష్టమే. పైగా జనాభాలో 50 శాతం మంది నిరుపేదలు, నిరక్షరాస్యులు. అమెరికాతో పోలిస్తే భారత్‌లో మూడ నమ్మకాలు, ఛాదస్తాలు కూడా ఎక్కువే. ఈ నేపధ్యంలో భారత్‌లో కరోనా ప్రవేశిస్తే కోట్లమంది దాని బారిన పడతారని, లక్షల మంది చనిపోతారని అప్పుడు భారత్‌ పరిస్థితి దయనీయంగా మారుతుందని కొందరు నిపుణులు జోస్యం చెప్పారు. 

కానీ తాజా లెక్కల ప్రకారం 135 కోట్ల జనాభాలో కేవలం 84,11, 724 మంది మాత్రమే దాని బారిన పడగా వారిలో సుమారు 75 లక్షల మంది పూర్తిగా కోలుకొన్నారు. ఇప్పటివరకు 1,24, 985 మంది మాత్రమే చనిపోయారు. 

అదే...సుమారు 33 కోట్లు జనాభా మాత్రమే ఉన్న అమెరికా అన్నివిధాలా అభివృద్ధి చెందింది. ఆర్ధికంగా చాలా బలంగా ఉంది. ఎంత ఖర్చు అయినా పెట్టగల స్థితిలో ఉంది. మేధావులకు కరువులేదు. చేతిలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిస్థితి జ్ఞానం అందుబాటులో ఉంటుంది. ఇక భారత్‌తో పోలిస్తే అమెరికాలో ప్రజలు ఆర్ధికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా కూడా మంచి స్థితిలోనే ఉంటారు. కనుక అమెరికా కరోనాను సులువుగానే అధిగమించి ఉండవచ్చు.  

కానీ తాజా లెక్కల ప్రకారం 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 99,28,467 మంది కరోనాబారిన పడగా వారిలో 63,42,180 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు అమెరికాలో 2,41,041 మంది చనిపోయారు. రెండు దేశాల గణాంకాలను పోల్చి చూస్తే కరోనాను ఎదుర్కోవడంలో ట్రంప్‌ ప్రభుత్వం ఖచ్చితంగా వైఫల్యం చెందిందనే అర్ధమవుతోంది. కనుక దానికే ట్రంప్‌ ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తున్నారన్న జేపీ నడ్డా అభిప్రాయం సరైనదే.


Related Post