కాంగ్రెస్ నిర్ణయంతో తెరాస ఒత్తిడికి గురైందా?

November 06, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకొన్న నిర్ణయంతో టిఆర్ఎస్‌ బహుశః ఒత్తిడికి గురైనట్లుంది. అందుకే వెంటనే దానిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. 

గురువారం ఆయన శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “బీసీల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే ఆ పార్టీకి బీసీలు గుర్తుకొస్తారు. కానీ సిఎం కేసీఆర్‌ బీసీల సంక్షేమం కోసం వారి కులవృత్తులను కాపాడుకొనేందుకు అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారు. సిఎం కేసీఆర్‌ పాలన బీసీలకు స్వర్ణయుగం వంటిది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు న్యాయం జరుగడంలేదంటూ గాంధీభవన్‌లో కార్యకర్తలు ఘర్షణలు పడటం అందరూ చూశారు. కనుక బీసీలను మభ్యపెట్టేందుకే వారికి 50 శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నారనుకోవచ్చు. బీసీలకు రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళతామని కాంగ్రెస్‌ చెప్పడం ఎన్నికలకు భయపడి పారిపోవడంగానే భావిస్తాము. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రం ఆమోదం కోసం పంపించాము. దానిపై కేంద్రం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు,” అని అన్నారు.  

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తే, తప్పకుండా టిఆర్ఎస్‌పై కూడా ఒత్తిడి ఏర్పడుతుంది. కానీ అందుకోసం పార్టీలో మిగిలిన కులాలవారిని కాదని 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక టిఆర్ఎస్‌ను ఒత్తిడికి గురిచేయాలనుకొంటే అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా అందుకు సిద్దం కావలసి ఉంటుంది. బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని ఇప్పుడు గొప్పగా ప్రకటించి ఆ తరువాత ఒత్తిళ్ళు తట్టుకోలేక బీసీలకు సీట్లు తగ్గిస్తే వారి ఆగ్రహానికి గురవక తప్పదు. అదే జరిగితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ చేజేతులా ఓ మంచి అస్త్రం అందించినట్లవుతుంది కూడా. కనుక కాంగ్రెస్ పార్టీయే దీని గురించి మళ్ళీ ఆలోచించుకొంటే మంచిదేమో?


Related Post