దేవుడు చెపుతున్నాడు...ట్రంప్‌ గెలుపు తధ్యం: పౌలా వైట్‌

November 05, 2020


img

యావత్ ప్రపంచాన్ని తన కనుసన్నలతో శాశించగలనని గట్టిగా నమ్మే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, అధ్యక్ష ఎన్నికలలో వెనుకబడిపోవడంతో గెలుపు కోసం ఇప్పుడు భగవంతుడి సహాయాన్ని ఆర్ధిస్తుండటం విచిత్రం. 

ఆయన ఆధ్యాత్మిక సలహాదారు పౌలా వైట్‌ నేడు వాషింగ్‌టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, “ట్రంప్‌ గెలుపు తధ్యం. ఆ విషయం నాకు భగవంతుడే స్వయంగా చెపుతున్నాడు. కానీ కొన్ని దుష్టశక్తులు ఆయన విజయాన్ని ఎత్తుకుపోవాలని ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్‌ను గెలిపించుకొనేందుకు దైవదూతలు ఆఫ్రికా నుంచి బయలుదేరారు. దేవుడు చెప్పినట్లుగా వారు ఇక్కడకు చేరుకొని ట్రంప్‌ను మళ్ళీ అధ్యక్షుడిగా చేయనున్నారు. నాకు అప్పుడే ఆ జయజయధ్వానాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి...”అంటూ ట్రంప్‌ గెలుపు కోసం ప్రార్ధనలు చేశారు. 

ఆమె చెప్పినట్లుగా ఆఫ్రికా నుంచి ట్రంప్‌ను కాపాడేందుకు ఎవరైనా వస్తున్నారో లేదో... ఆమె ప్రార్ధనలతో ట్రంప్‌ విజయం సాధిస్తారో లేదో తెలియదు కానీ దీంతో ట్రంప్‌ తన ఓటమిని పూర్తిగా అంగీకరించారని డెమొక్రాట్లు అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో డోనాల్డ్ ట్రంప్‌కు 214 ఎలక్టోరల్ ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్ధి, డెమొక్రాట్ అభ్యర్ధి జో బైడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మరో 6 ఓట్లు సాధిస్తే ఆయనే అమెరికా అధ్యక్ష పదవి చేపడతారు. 

కొన్ని రాష్ట్రాలలో ఇంకా మెయిల్-ఇన్‌ బ్యాలెట్లను స్వీకరిస్తుండటంతో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వాటిని తక్షణం నిలిపివేయాలని, కొన్ని రాష్ట్రాలలో మళ్ళీ ఓట్లను లెక్కించాలని కోరుతూ ట్రంప్‌ ఆయా రాష్ట్రాల కోర్టులలో పిటిషన్లు వేశారు. అవసరమైతే సుప్రీంకోర్టు సహాయంతో మళ్ళీ అధ్యక్ష పదవి దక్కించుకోవాలని ట్రంప్‌ ప్రయత్నిస్తున్నారు. కానీ అది సాధ్యమవుతుందో లేదో తెలియదు. కనుక పౌలా వైట్‌ ట్రంప్‌ గెలుపు కోసం ప్రార్ధనలు చేశారు. మరి అవి ఫలిస్తాయో లేదో తెలియాలంటే ఈ నెల 12వరకు వేచి చూడక తప్పదు.


Related Post