జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జనవరిలోనే?

November 05, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు నవంబర్‌ 13 తరువాత ఎప్పుడైనా నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారధి చెప్పడమే కాక ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించి వారికి శిక్షణా శిబిరం కూడా నిర్వహించారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తే టిఆర్ఎస్‌ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్వయంగా సిఎం కేసీఆర్‌కు సూచించినట్లు తాజా సమాచారం.

ఇటీవల నగరంలో భారీ వర్షాలు, వరదల కారణంగా నేటికీ పలు ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదభాదితులను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.10,000 చొప్పున ఆర్ధికసాయం అందజేసింది.  కానీ అది చాలామందికి అందకపోవడంతో వారందరూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో వరద బాధితులు ధర్నాలు కూడా చేస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాలు వారికి మద్దతు ప్రకటించి రెచ్చగొడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసి ఒక్కో కుటుంబానికి రూ.10,000 కాదు...రూ.30,000 ఆర్ధికసాయం అందించాలని డిమాండ్ చేస్తోంది.     

ఈ పరిస్థితులలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళితే టిఆర్ఎస్‌ నష్టపోతుందని, కనుక జనవరి వరకు వేచి ఉండటమే మంచిదని టిఆర్ఎస్‌ నేతలు, కార్పొరేటర్లు కేటీఆర్‌కు చెపుతున్నారు. కేటీఆర్‌ కూడా స్వయంగా ముంపు ప్రాంతాలలో పర్యటించి అక్కడి పరిస్థితులను, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూశారు కనుక ఆయనకు కూడా వాస్తవ పరిస్థితులు బాగా తెలుసు. కనుక పరిస్థితులు చక్కబడేవరకు ఆగి జనవరిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను జరిపిస్తేనే మంచిదని సిఎం కేసీఆర్‌కు సూచించినట్లు సమాచారం. 

సిఎం కేసీఆర్‌కు కూడా నగరంలో పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంటుంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పదవీకాలం ఎలాగూ ఫిబ్రవరి వరకు ఉంది కనుక జనవరిలో ఎన్నికలు జరిపించినా ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. కనుక త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.


Related Post