 
                                        టిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుదవారం హైదరాబాద్‌లోని ఆదర్శ్ నగర్‌లో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి నేతలు తమ స్థాయిని దిగజార్చుకొనేవిధంగా మాట్లాడటమే కాక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా కేసీఆర్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. రాష్ట్ర బిజెపి నేతలు కేంద్రం నుంచి రాష్ట్రం కోసం ఒక్క పైసా సాధించలేకపోయినా, రాష్ట్రంలో సిఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలన్నిటికీ కేంద్రప్రభుత్వమే నిధులు ఇస్తోందంటూ అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చాలా ప్రయత్నించారు. కానీ వారికి ఎన్నికల ఫలితాలే సరైన సమాధానం చెపుతాయి. రాష్ట్రంలో ప్రజలు ఎవరి పక్షాన్న ఉన్నారో అప్పుడే వారికి అర్ధమవుతుంది,” అని అన్నారు. 
దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్ అవలీలగానే భారీ మెజార్టీతో గెలుస్తుందని టిఆర్ఎస్ అంచనా వేసింది. కానీ ఈసారి బిజెపి నేతలు చాలా పట్టుదలగా పోరాడటంతో టిఆర్ఎస్ ఎదురీదవలసివచ్చింది. అయితే దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో ఘనవిజయం సాధిస్తే రాబోయే ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్ మునిసిపల్ ఎన్నికలలో దాని గురించి గట్టిగా ప్రచారం చేసుకొని లబ్ది పొందవచ్చు కానీ దుబ్బాకలో ఒకవేళ స్వల్ప మెజార్టీతో గెలిస్తే దాని గురించి గొప్పగా చెప్పుకోలేదు. పైగా ప్రతిపక్షాలు దెప్పిపొడుపులు భరించవలసి వస్తుంది. దుబ్బాక ప్రజలు ఇంతకీ ఏ పార్టీని గెలిపిస్తారో తెలియాలంటే నవంబర్ 10 వరకు ఎదురుచూడవలసిందే.