ధరణీ పోర్టల్‌పై హైకోర్టు తాజా ఉత్తర్వులు

November 03, 2020


img

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణీ పోర్టల్‌పై అప్పుడే అభ్యంతరాలు, కోర్టు స్టేలు మొదలైపోయాయి. దానిపై దాఖలైన నాలుగు పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. 

కొత్త రెవెన్యూ చట్టం సాగుభూములకు సంబందించినది మాత్రమేనని కనుక ధరణీలో వ్యవసాయేతర ఆస్తులను నమోదు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ధరణీ కోసం ప్రజలను ఆధార్ కార్డ్ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దని సూచించింది. కొత్త రెవెన్యూ చట్టంలో ధరణీలో డేటా సేకరణ, భద్రత గురించి ఎటువంటి ప్రస్తావన లేదని హైకోర్టు పేర్కొంది. కనుక ధరణీలో డేటా భద్రత కోసం ఎటువంటి చర్యలు చేపట్టిందో తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సరైన జాగ్రత్తలు పాటించకుండా ధరణీలో వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేసి దానిని అందరికీ అందుబాటులో ఉంచితే, దాని వలన చాలా సమస్యలు ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. కనుక ధరణీ డేటా నిర్వహణ బాధ్యతను ‘థర్డ్ పార్టీ’కి అప్పగించవద్దని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ధరణీలో డేటా భద్రత, నిర్వహణ, వ్యవసాయేతర ఆస్తుల నమోదు వగైరా పూర్తి సమాచారంతో రెండు వారాలలో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటివరకూ ధరణీలో వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నమోదు చేయవద్దని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదావేసింది. 

రాష్ట్రంలో ప్రతీ అంగుళం భూమి, ఆస్తుల వివరాలను ధరణీలో పొందుపరచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే హైకోర్టు తాజా వ్యాఖ్యలు, ఆదేశాలతో బ్రేక్ వేసినట్లయింది. ధరణీలో ఆస్తుల వివరాలను నమోదు చేయడం ఎంత ముఖ్యమో, ఆ వివరాలతో మోసాలు జరుగకుండా డేటాకు భద్రత కల్పించడం అంతకంటే ముఖ్యం. అయితే ధరణీలో డేటాకు పూర్తి భద్రత కల్పించమని, దానిని ఎవరూ హాక్ చేయలేని విధంగా చాలా అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించమని ప్రభుత్వం చెపుతోంది. 


Related Post