నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు

November 03, 2020


img

అమెరికా 46వ అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు నేడు పోలింగ్ జరుగనుంది. మళ్ళీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌, జో బైడెన్‌కు మద్య చాలా తీవ్రమైన పోటీ నెలకొంది. డోనాల్డ్ ట్రంప్‌ రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కాగా జో బైడెన్‌ డెమొక్రాట్ అభ్యర్ధి. 

అమెరికాలో లక్షలాదిమంది కరోనాబారిన పడ్డారు. సుమారు 2 లక్షల మంది చనిపోయారు. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో కోట్లాదిమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. ఈనేపధ్యంలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. 

మొదట్లో డోనాల్డ్ ట్రంప్‌ చాలా దూకుడుగా ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతూ జో బైడెన్‌పై పైచేయి సాధించినప్పటికీ, అత్యంత కీలకమైన పోస్టల్ బ్యాలెట్, ప్రీ-పోలింగ్ మొదలయ్యే సమయానికి వరుసగా చాలా తప్పటడుగులు వేశారు. ముఖ్యంగా ట్రంప్‌ నోటిదురుసు, అహంభావ ధోరణితో సొంత అధికారులతో సహా ప్రజలకు కూడా ఆగ్రహం కలిగించేలా వ్యవహరించారు. ప్రవాస భారతీయులను ఆకట్టుకొనేందుకు కుటుంబ సమేతంగా భారత్‌ను సందర్శించిన డోనాల్డ్ ట్రంప్‌, ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకొనేసరికి క్రమంగా ప్రవాస భారతీయులను దూరం చేసుకొన్నారు. 

డెమొక్రాట్ పార్టీ తరపున ఉపాధ్యక్షపదవికి పోటీ పడుతున్న భారత్‌-ఆఫ్రికన్‌ మూలాలు కలిగిన కమలా హారీస్ పట్ల చాలా చులకనగా, అనుచితంగా మాట్లాడి అటు ప్రవాసభారతీయులను, అమెరికాలోని నల్లజాతీయుల మనోభావాలు దెబ్బతినేవిధంగా వ్యవహరించారు. అలాగే కరోనా విషయంలో చైనా గురించి ట్రంప్‌ మాట్లాడిన మాటలు అమెరికాలో స్థిరపడిన చైనా దేశస్థులకు ఆగ్రహం కలిగించడం సహజం కనుక వారు కూడా డెమొక్రాట్ అభ్యర్ధివైపే మొగ్గు చూపడం తధ్యం. ఈ నేపధ్యంలో ఇప్పటివరకు వెలువడిన అన్ని సర్వేలలోనూ ఆయన వెనుకబడగా జో బైడెన్‌కు అనుకూలంగా ఉన్నాయి. 

కానీ ధృడమైన నాయకుడు కావాలని కోరుకొనే అమెరికన్లు మళ్ళీ డోనాల్డ్ ట్రంప్‌కే అధికారం కట్టబెడతారా లేదా డోనాల్డ్ ట్రంప్‌పై వ్యతిరేకతతో జో బైడెన్‌కు అప్పగిస్తారా అనేది మరికొన్ని గంటలలోనే తేలిపోతుంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్, ముందస్తు పోలింగ్ ద్వారా అమెరికాలో సగానికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకొన్నారు. కనుక ఇవాళ్ళ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభించి వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు.


Related Post