దుబ్బాకలో గెలుపు కోసం టిఆర్ఎస్‌, బిజెపిల ఆరాటం

November 02, 2020


img

ఈసారి దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌-కాంగ్రెస్ పార్టీలకు బదులు టిఆర్ఎస్‌-బిజెపిల మద్య పోరు జరుగుతుండటం విశేషం. వాటిమద్య జరుగుతున్నా భీకర పోరాటంలో కాంగ్రెస్‌ ఊసే వినబడటం లేదు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బిజెపి నేతలు టిఆర్ఎస్‌ను చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు. దుబ్బాకలో టిఆర్ఎస్‌ను ఓడించితీరాలనే పట్టుదలతో చాలా కసిగా పనిచేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో సంక్షేమ పధకాల చుట్టూనే ఇరుపార్టీల మద్య మాటల యుద్ధాలు జరుగుతుండటం విశేషం. ఈ విషయంలో బిజెపి నేతలు అబద్దాలు చెపుతున్నారని, బహిరంగచర్చకు రమ్మని మంత్రి హరీష్‌రావు సవాళ్ళు విసురుతున్నా బిజెపి నేతలు ఏమాత్రం పట్టించుకోకుండా సంక్షేమ పధకాల విషయంలో టిఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తుండటం మరో విశేషం.

కాంగ్రెస్‌, బిజెపిలలో దేనికి ఓట్లు వేసి గెలిపించినా వారు మళ్ళీ కనబడరని, దుబ్బాక అభివృద్ధికి, ప్రజలకు ఏమీ చేయరని కనుక టిఆర్ఎస్‌కే ఓట్లువేసి గెలిపించాలని మంత్రి హరీష్‌రావు కోరుతున్నారు. మంత్రి హరీష్‌రావు వాదనలలో చాలా బలం ఉందనే సంగతి దుబ్బాక ప్రజలకు ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది. సిఎం కేసీఆర్‌ కూడా ఈ విషయంలో బిజెపికి సవాలు విసరడమే కాక తమ వాదనలు తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని సవాలు విసిరారు. తద్వారా మంత్రి హరీష్‌రావు వాదనలను బలపరుస్తున్నట్లు దుబ్బాక ఓటర్లకు సిఎం కేసీఆర్‌ చాలా స్పష్టమైన సందేశం పంపించారని చెప్పవచ్చు.

సిఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావుల తరువాత మంత్రి కేటీఆర్‌ కూడా ‘బిజెపి నేతలు హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారంటూ’ తీవ్ర ఆరోపణలు చేశారు. బిజెపి నేతలు నిజంగా అటువంటి దుస్సాహసం చేయాలనుకొన్నారో లేదో తెలియదు కానీ మంత్రి కేటీఆర్‌ చేసిన ఈ తాజా తీవ్రమైన ఆరోపణలు కూడా దుబ్బాకలో బిజెపిని దెబ్బ తీసే అవకాశం ఉందని భావించవచ్చు.

కానీ ఎన్నడూ లేనివిధంగా సిఎం కేసీఆర్‌ మొదలు మంత్రి హరీష్‌రావు వరకు టిఆర్ఎస్‌లో అందరూ బిజెపినే లక్ష్యంగా చేసుకొని పోరాడుతుండటం గమనిస్తే దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి చాలా గట్టిపోటీ ఇస్తోందని స్పష్టమవుతోంది. కనుక ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపిలలో ఏ పార్టీ గెలుస్తుందో తెలియాలంటే నవంబర్‌ 10న ఫలితాలు వెలువడేవరకు ఎదురుచూడక తప్పదు.


Related Post