కేసీఆర్‌ రాజీనామా ప్రస్తావన అందుకే: విజయశాంతి

November 02, 2020


img

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపధకాలకు కేంద్రం నిధులిస్తోందనే అంశంపై మంత్రి హరీష్‌రావు, బిజెపి నేతల మద్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మూడుచింతలపల్లి గ్రామంలో ధరణీ పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో సిఎం కేసీఆర్‌ కూడా బిజెపి నేతలకు సవాలు విసురుతూ, “ఒకవేళ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమపధకాలకు కేంద్రం నిధులిస్తోందని నిరూపించగలిగితే నా పదవికి రాజీనామా చేస్తాను,” అని సవాలు విసిరారు. సిఎం కేసీఆర్‌ సవాలును కాంగ్రెస్‌ సీనియర్ నేత విజయశాంతి చాలా భిన్నమైన కోణంలో చూసి స్పందించారు. 

“మంత్రి హరీష్‌రావు దుబ్బాక ఉపఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలకు డిపాజిట్ కూడా రాకుండా చేయాలని చాలా శ్రమిస్తున్నారు. కానీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్‌ ఆయనకే పెద్ద షాక్ ఇవ్వబోతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తికాగానే సిఎం కేసీఆర్‌ తన కుమారుడు కేటీఆర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నారు. అందుకే ఎన్నడూ లేనివిధంగా రాజీనామా చేస్తానని అన్నారని భావించవచ్చు. గతంలో తమ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే విపక్ష నేతలను జైలుకు పంపిస్తామని హెచ్చరించిన సిఎం కేసీఆర్‌ ఇప్పుడు రాజీనామా చేస్తాననడమే నిదర్శనం. ఆయన రాజీనామా చేయడానికి ఓ బలమైన కారణం కావాలి కనుక ఈ సాకుతో తప్పుకొని కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనుకొంటున్నారు. సిఎం కేసీఆర్‌ మాటలు రాష్ట్రంలో త్వరలో జరుగబోయే రాజకీయమార్పుకు సంకేతంగా చూడవచ్చు,” అని విజయశాంతి అన్నారు.  

ఏదో ఓ రోజున మంత్రి కేటీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి అవడం ఖాయమనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం అపార రాజకీయానుభవం కలిగిన మంత్రి హరీష్‌రావుకు తెలియదనుకోలేము. కనుక ఒకవేళ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే అదేమీ హరీష్‌రావుకు షాక్ కాబోదు. బహుశః ఆయన కూడా అందుకు మానసికంగా సిద్దంగానే ఉండి ఉండవచ్చు. అయితే కేటీఆర్‌ను ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తారనేది ఎవరికీ తెలియదు కనుక అంతవరకు ఈ విషయంపై ఇటువంటి సందర్భాలలో ఊహాగానాలు వినిపిస్తుండటం సహజమే. విజయశాంతి కూడా అలాగే ఊహించి ఉండవచ్చు. అయితే ఆమె జోస్యానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫ్లాష్ బ్యాక్‌ను జోడించి చూస్తే ఆమె చెపుతున్నది జరిగే అవకాశం ఉందని అర్ధమవుతుంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను గెలిపించినందుకు కేటీఆర్‌కు అదనంగా మరో రెండు మంత్రిపదవులు సిఎం కేసీఆర్‌ కట్టబెట్టారు. కనుక ఈసారి గెలిస్తే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేదు.


Related Post