త్వరలో ఏపీ-తెలంగాణ అంతర్ రాష్ట్ర బస్‌ సర్వీసులు షురూ

November 02, 2020


img

త్వరలో ఏపీ, తెలంగాణ అంతర్ రాష్ట్ర బస్‌ సర్వీసులు ప్రారంభంకానున్నాయి. కేంద్రప్రభుత్వం అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతించి చాలా కాలమే అయినప్పటికీ సమాన రూట్లు, సమాన కిలోమీటర్ల విషయంలో రెండురాష్ట్రాల ఆర్టీసీల మద్య ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా ఇంతకాలం ఆర్టీసీ బస్సులు నడువలేదు. టీఎస్‌ఆర్టీసీ సూచనల మేరకు ఏపీఎస్ ఆర్టీసీ తన సర్వీసులను, రూట్లను తగ్గించుకొనేందుకు అంగీకరిస్తూ ప్రతిపాదనలు పంపింది. టీఎస్‌ఆర్టీసీ కూడా వాటిని అంగీకరించింది. కనుక ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు నేడు హైదరాబాద్‌లో సమావేశమయ్యి ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఆ ఒప్పందం ప్రకారమే ఒకటి రెండు రోజులలో ఏపీ-తెలంగాణల మద్య అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 

తాజా సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 1,60,919 కిమీ మేర ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. గతంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 1,009 బస్సులు తెలంగాణలో 2,65,367కిమీ మేర తిరిగేవి. అదేవిధంగా ఏపీలో 1,61,258 కిమీ మేర టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. 

రెండు ఆర్టీసీలకు భారీగా ఆదాయం సమకూర్చే హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 374 ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు తిరిగేవి. వాటిని 192కు తగ్గించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించింది. గతంలో ఈ రూట్‌లో 162 టీఎస్‌ఆర్టీసీ బస్సులు తిరుగుతుండేవి. ఇక నుంచి 273 బస్సులు తిరుగనున్నాయి. ఇదేవిధంగా హైదరాబాద్‌-కర్నూల్, హైదరాబాద్‌- భద్రాచలం కారిడార్‌లలో కూడా ఏపీఎస్ బస్సుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకొంది.


Related Post