టిఆర్ఎస్‌ అభ్యర్ధి బలహీనతకు అద్దం పడుతున్న ప్రచారం

October 30, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాతను గెలిపించుకొనేందుకు మంత్రి హరీష్‌రావు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నంలో ఆయన ఓటర్లకు చేస్తున్న వాగ్దానాలు, ప్రచారంలో మాట్లాడుతున్న మాటలతో టిఆర్ఎస్‌ అభ్యర్ధి సుజాతకి విషయపరిజ్ఞానం లేదని ఆమె కేవలం నామమాత్రమేనని స్పష్టం అవుతోంది. అయితే అందుకు ఆమెను తప్పు పట్టలేము. ఎందుకంటే ఆమెను తెరాసయే ఈ ఎన్నికల బరిలో దించింది కనుక.  

దుబ్బాకలో ప్రచారం మొదలుపెట్టిన కొత్తలో ‘నేనే అభ్యర్ధినని భావించి సోలిపేట సుజాతకు ఓట్లువేసి గెలిపించాలని’ మంత్రి హరీష్‌రావు ప్రజలను కోరారు. ఆ తరువాత సిఎం కేసీఆర్‌, రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను దృష్టిలో ఉంచుకొని ఓట్లు వేయాలని కోరారు. 

గురువారం తొగుట మండలంలో ఘనపూర్, గుడికందులలో ప్రచారంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ అభ్యర్ధిని గెలిపిస్తే దుబ్బాకను అభివృద్ధి చేసే బాధ్యతను నేనే తీసుకొంటాను. సిద్ధిపేట, గజ్వేల్లో నిర్వాసిత రైతులకు ఇచ్చినట్లే దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్, కాలువలకు భూములు కోల్పోయిన రైతులను నష్టపరిహారం ఇచ్చే బాధ్యత నేనే తీసుకొంటాను. ఎన్నికలు కోడ్ ఎత్తేసిన తరువాత దుబ్బాక నియోజకవర్గంలో రహదారుల మరమత్తులు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, సామాజిక భవనాలు, మార్కెట్ వగైరాల నిర్మాణ పనులను నా భుజాన్న వేసుకొని చేయిస్తాను, ” అని హామీలు ఇచ్చారు.  

సోలిపేట సుజాతకు బదులు మంత్రి హరీష్‌రావు ఈ హామీలన్నీ ఇస్తున్నారు కనుక ఆయనే దుబ్బాకలో పోటీ చేస్తున్నట్లు భావించాలని మొదటచెప్పిన మాటలు నిజమని భావించవలసి ఉంటుందేమో? అలాగే టిఆర్ఎస్‌ను గెలిపిస్తే దుబ్బాకను అభివృద్ధి చేస్తానంటూ మంత్రి హరీష్‌రావు చెప్పిన మాటలు విన్నప్పుడు టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఇంతకాలం దుబ్బాకను పట్టించుకోలేదని స్పష్టం అవుతోంది. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో కూడా అశ్రద్ద చూపినట్లు అర్దమవుతోంది. కాంగ్రెస్‌, బిజెపిలకు ఓట్లువేస్తే దుబ్బాకను అభివృద్ధి చేయవని వాదిస్తున్నప్పుడు, మరి ఇంతకాలం దుబ్బాకకు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే (సోలిపేట రామలింగారెడ్డి) ప్రాతినిధ్యం వహిస్తున్నపుడు ఈ సమస్యలన్నీ ఎందుకు పరిష్కరించలేదు?ఇప్పుడు మంత్రి హరీష్‌రావు చెపుతున్న పనులను ఎందుకు చేయించలేదు? అనే ప్రశ్నలకు టిఆర్ఎస్‌ అభ్యర్ధి సమాధానం చెప్పలేకపోవచ్చు కనుక మంత్రి హరీష్‌రావే చెప్పాల్సి ఉంటుంది.


Related Post