హైదరాబాద్‌-ముంబై హైస్పీడ్ రైల్‌ ప్రాజెక్టు తాజా సమాచారం

October 30, 2020


img

దేశంలో కొన్ని ప్రధాన నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైళ్లు నడిపించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాటిలో హైదరాబాద్‌ నుంచి పూణే మీదుగా ముంబై ప్రాజెక్టు కూడా ఒకటి. వాటి కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నవంబర్‌ 5వ తేదీన నిపుణుల కమిటీతో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనుంది. ఆ సమావేశంలో హైదరాబాద్‌-పూణే-ముంబైతో సహా ఇతర కారిడార్ల సర్వే, విద్యుత్, భూసేకరణ, డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్), ఇతర సాంకేతిక, ఆర్ధిక అంశాల గురించి లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాటి ఆధారంగా నవంబర్‌ 11వ తేదీన ఈ పనులకు టెండర్లు ఆహ్వానించనుంది.

ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులను చేపట్టేందుకు సంసిద్దతను తెలియజేశాయి. కనుక నవంబర్‌ నెలాఖరులోగా టెండర్లు తెరిచి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రాజెక్టు పనులపై ఒప్పందాలు జరిగినప్పటి నుంచి 3-4 ఏళ్ళలోగా పూర్తిచేయాలని షరతు విధించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే.. 2025కల్లా హైదరాబాద్‌-పూణే-ముంబై కారిడార్‌తో సహా భారత్‌లో పలు నగరాల మద్య హైస్పీడ్ రైళ్ళు దూసుకుపోయే అవకాశం ఉంది. ఇప్పటికే జపాన్ సహాయసహహకారాలతో అహ్మదాబాద్-ముంబై వద్ద బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు చురుకుగా సాగుతున్నాయి. 2023 ఆగస్ట్ 15వ తేదీన తొలి బుల్లెట్ రైలు నడిపించాలని కేంద్రప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.   

బుల్లెట్ ట్రెయిన్ గంటకు 300-350 కిమీ వేగంతో ప్రయాణిస్తే, హైస్పీడ్ రైళ్ళు గంటకు 200-250 కిమీ వేగంతో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళలో హైదరాబాద్‌ నుంచి ముంబై మద్య గల 711 కిమీ దూరం అధిగమించడానికి సుమారు 11-12 గంటలు పడుతోంది. హైస్పీడ్ రైళ్ళు అందుబాటులోకి వస్తే 5-6 గంటలలోనే హైదరాబాద్‌ నుంచి ముంబై చేరుకోవచ్చు.


Related Post