రేవంత్‌ రెడ్డి కూడా బిజెపిలోకే... కేటీఆర్‌

October 29, 2020


img

సిఎం కేసీఆర్‌, తనపై బిజెపి నేతలు చేస్తున్న తీవ్ర ఆరోపణలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బుదవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బిజెపి నేతలకు అసలు తక్కువ హడావుడి ఎక్కువ. 2018 శాసనసభ ఎన్నికలలో కూడా ఇలాగే చాలా హడావుడి చేశారు. కానీ ఏమైంది? 105 స్థానాలలో డిపాజిట్లే దక్కలేదు. ఇప్పుడూ దుబ్బాకలో అదే జరుగబోతోంది. ఫలితాలు వస్తే బిజెపి నేతల నోళ్ళు వాటంతట అవే మూతపడతాయి. వారికి జనాధారణ లేకపోవడంతో సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ ఆ లోటును భర్తీ చేసుకొంటున్నారు. దుబ్బాకలో ఏదో జరిగిపోతోంది... బిజెపి గెలుపు ఖాయం... అంటూ సిఎం కేసీఆర్‌ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయం కూడా మరిచిపోయి ఆయన గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అదే... శాసనసభలో ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ గురించి అనుచితంగా మాట్లాడబోతే సిఎం కేసీఆర్‌ వారించి అడ్డుకొన్నారు. అదీ మీకు...మాకు తేడా.

బిజెపి నేతలు నోరు అదుపుచేసుకొని మాట్లాడితే మంచిది లేకుంటే మా సహనం నశిస్తే మేము కూడా ధీటుగా జవాబులు చెప్పగలం. విమర్శించగలం. టిఆర్ఎస్‌, బిజెపిలు కుమ్మక్కు అయ్యాయని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నట్లు విన్నాను. ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేదా బిజెపిలో చేరబోతున్నారో చెపితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన కూడా బిజెపిలో చేరేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు విన్నాను,” అని అన్నారు. 


Related Post