విజయశాంతి కాంగ్రెస్‌లోనే ఉంటారట

October 28, 2020


img

సీనియస్ కాంగ్రెస్‌ నేత విజయశాంతి గత కొంతకాలంగా పార్టీ కార్యాలయానికి రావడం లేదు. పార్టీ వ్యవహారాలలో పాల్గొనడం లేదు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచారకమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఆమె కాంగ్రెస్‌ నేతలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. 

ఈ నేపధ్యంలో సోమవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో ఆమె ఇంటికి వెళ్ళి కలిశారు. వారిరువురూ సుమారు గంటసేపు మాట్లాడుకొన్నారు. అంతకు ముందు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ కూడా ఆమెను కలిశారు. బిజెపి నేతలతో ఆమె భేటీ అవుతుండటంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి త్వరలో బిజెపిలో చేరబోతున్నారని మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. దుబ్బాక ఉపఎన్నికల హడావుడిలో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెంటనే అప్రమత్తమయ్యారు. 

కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ కుసుమ కుమార్‌ను ఈరోజు ఆమెవద్దకు పంపించారు. ఆయన విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగవలసిందిగా బుజ్జగించి ఒప్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “విజయశాంతికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలంటే చాలా గౌరవం. ఆమె కరోనా కారణంగానే దుబ్బాక ఉపఎన్నికల ప్రచారానికి రాలేకపోయానని చెప్పారు. ఆమె కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారని మీడియాలో వస్తున్నవన్నీ కేవలం ఊహాగానాలే తప్ప నిజం కాదు. ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారు. సీనియర్ నాయకురాలైన విజయశాంతికి పార్టీలో ఎప్పుడూ సముచిత గౌరవం ఉంటుంది,” అని చెప్పారు.        

అయితే బిజెపి నేతలను ఆమె ఎందుకు కలిశారో కుసుమకుమార్ చెప్పనేలేదు. బుదవారం సాయంత్రం కుసుమకుమార్ కలిసి వెళ్ళిన తరువాత సుమారు 6 గంటలకు విజయశాంతి ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పోస్టులు పెట్టారు కానీ పార్టీ మారడం గురించి మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఖండించలేదు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని దృవీకరించలేదు!

కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఆమెతో మాట్లాడి వెళ్లారు కనుక ఆమెకు బిజెపి అధిష్టానం నుంచి ఎటువంటి హామీ లేదా పదవి లభిస్తుందనే దానిని బట్టి ఆమె బిజెపిలో చేరుతారా లేదా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? అనేది తెలియవచ్చు. అంతవరకు ఆమె ‘చైర్‌పర్సన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచారకమిటీ’ అని చెప్పుకోవడం సహజం. కనుక ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారనుకోవడం కూడా సహజమే. 



Related Post