దుబ్బాకలో బిజెపి సెల్ఫ్ గోల్స్ చేసుకొంటోందా?

October 28, 2020


img

దుబ్బాకలో బిజెపి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకొంటోందని మంత్రి హరీష్‌రావు చెప్పడం ఆలోచించవలసిన విషయమే. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పధకాలకు కేంద్రం కూడా నిధులు ఇస్తోందనే అంశంపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి హరీష్‌రావు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కు సవాలు విసిరితే ఆయన స్పందించలేదు. అంటే ఆవిషయంలో బిజెపి నేతలు అనాలోచితంగా మాట్లాడి తప్పటడుగువేశారని స్పష్టం అయ్యింది. 

అలాగే మొన్న బిజెపి నేతల ఇళ్ళలో పట్టుబడిన డబ్బును పోలీసులే తెచ్చి అక్కడ పెట్టేందుకు ప్రయత్నించారనే వాదనలను బిజెపి నేతలు నిరూపించలేకపోయారు. కానీ పోలీసులు వాటికి సంబందించి వీడియో సాక్ష్యాధారాలను బయటపెట్టడంతో బిజెపి నేతలు మళ్ళీ తొందరపాటుతో మరో తప్పటడుగు వేశారని స్పష్టం అయ్యింది. 

ఈ రెంటితో ఇప్పటివరకు దుబ్బాక ఉపఎన్నికలలో బిజెపి నేతలు చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్లయింది. 

ఉద్యోగాల భర్తీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ హామీ అమలులో వైఫల్యం వంటి పలు అంశాలతో  టిఆర్ఎస్‌ను ఇన్నిరోజులు బిజెపి ఇరుకునపెడుతోంది. అలాగే రాజకీయ అనుభవం, విషయ పరిజ్ఞానంలేని టిఆర్ఎస్‌ అభ్యర్ధి సోలిపేట సుజాత శాసనసభలో మాట్లాడలేరని, కనుక నియోజకవర్గం అభివృద్ధికి నిధులు తీసుకురాలేరని బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు చేస్తున్న ప్రచారంతో టిఆర్ఎస్‌ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. 

కానీ పోలింగ్ తేదీ (నవంబర్‌ 3) దగ్గరపడుతుండగా బిజెపి ఇటువంటి తప్పిదాలు చేయడం సెల్ఫ్ గోల్స్ అనే చెప్పాలి. ఇటువంటి కీలకసమయంలో అవి రాజకీయ ఆత్మహత్యతో సమానమే. కనుక జరిగిన ఈ నష్టాన్ని బీజేపీ నేతలు ఏదోవిధంగా పూడ్చుకొంటూనే ఇకనైనా ఆచితూచి అడుగు ముందుకు వేస్తే మంచిది.


Related Post