ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితి

October 28, 2020


img

ఏపీ రాజకీయాలలో చాలా విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్రమంతటా కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో ఎన్నికలను నిరవదికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. అప్పటికే అనేకచోట్ల ఏకగ్రీవాలతో దూసుకుపోతున్న అధికార వైసీపీ దాంతో షాక్ అయ్యింది. 

అప్పుడు నిమ్మగడ్డ నిర్ణయంపై సాక్షాత్ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఆయనను ఆ పదవిలో నుంచి తొలగించి ఆయన స్థానంలో వేరేవ్యక్తిని నియమించారు. కానీ ఆ నియామకం చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో మళ్ళీ నిమ్మగడ్డ బాధ్యతలు చేపట్టారు. 

ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గినందున బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు చాలా రాష్ట్రాలలో ఉపఎన్నికలు జరుగుతుండటంతో ఏపీలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ భావించి అభిప్రాయ సేకరణకు ఏపీలో అన్ని రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించారు. 

కరోనా ఉదృతంగా ఉన్న సమయంలో ఎన్నికలు కొనసాగించాలని పట్టుబట్టిన అధికార వైసీపీ, ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గి ఎన్నికల కమీషనర్ స్వయంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్దపడి సమావేశానికి ఆహ్వానిస్తే దానికి హాజరు కాలేదు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని తీసుకోవాలనే సుప్రీంకోర్టు సూచనను పట్టించుకోకుండా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం నిర్వహించినందుకు నిరసనగా దానిని బహిష్కరిస్తున్నట్లు వైసీపీ తెలిపింది. 

అయితే ఈ సమావేశానికి హాజరైన మిగిలిన అన్ని ప్రతిపక్షపార్టీలు మార్చిలో జరిగిన ఎన్నికలలో వైసీపీ చాలా అక్రమాలకు, బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకోనందున వాటిని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేసి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. కనుక ఇప్పుడు ఎన్నికల కమీషనర్ స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్దపడితే ఏపీ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.


Related Post