వ్యాక్సిన్‌ రాకమునుపే కరోనా నుంచి విముక్తి?

October 27, 2020


img

దేశంలో కోట్లాదిమంది ప్రజల జీవితాలను చిందరవందర చేసి, భారత్‌ అభివృద్ధికి అవరోధంగా మారిన కరోనా మహమ్మారిని భారత్‌ జయిస్తున్నట్లే కనబడుతోంది. నెలరోజుల క్రితం వరకు భారత్‌లో రోజుకు 70-80,000 కొత్త కేసులు నమోదవుతుండేవి కానీ ఇప్పుడు ఆ సంఖ్య 36,000కు దిగింది. అలాగే కరోనా నుంచి బయటపడుతున్నవారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. మరణాల సంఖ్య తగ్గుతోంది.

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్‌ ప్రకారం, దేశంలో మొట్టమొదటిసారిగా మూడు నెలల క్రితం స్థాయికి కరోనా కేసులు పడిపోయాయి. సోమవారం దేశవ్యాప్తంగా 36,469 మందికి కరోనా సోకగా, 63,842 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 79,46,429 కేసులు నమోదు కాగా వారిలో 72,01, 070 మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఆ లెక్కన కరోనా రికవరీ శాతం 90.23 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,25,857 మంది యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా మరణాల రేటు 1.50 శాతానికి తగ్గిందని తెలియజేసింది. ఇంతవరకు కరోనా సోకితే మందులు వాడటమే తప్ప కరోనా సోకకుండా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. అయినా కూడా దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం గమనిస్తే కరోనాకు వ్యాక్సిన్‌ రాకమునుపే భారత్‌ కరోనా నుంచి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.


Related Post