దానర్ధం యుద్ధం చేయబోమని కాదు: అజిత్ ధోవల్

October 27, 2020


img

భారత్‌-చైనా మద్య సరిహద్దుల వద్ద గత 5-6 నెలలుగా నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపధ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు, భారత్‌ జాతీయ భద్రతాసలహాదారు అజిత్ ధోవల్ చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈనెల 24న రిషికేశ్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత నాగరికత, విదేశీవిధానాల గురించి మాట్లాడుతూ, “భారత్‌ ఎన్నడూ ఇరుగుపొరుగు దేశాలపై దాడి చేయలేదు. దురాక్రమణలకు పాల్పడలేదు. కానీ దానర్ధం భారత్‌పై దాడి జరిగితే సహిస్తుందని కాదు. దేశానికి ప్రమాదమని భావిస్తే భారత్‌ తప్పకుండా ఎదురుదాడి చేస్తుంది. దేశాన్ని కాపాడుకొనేందుకు ఎంతకైనా తెగిస్తుంది. అవసరమైతే మన భూభాగం మీద కానీ...ఇతరదేశాల భూభాగాలమీద కానీ భారత్‌ పోరాడుతుంది. అయితే వ్యక్తిగత, స్వార్ధ ప్రయోజనాల కోసం భారత్‌ ఎన్నడూ అటువంటి పనులకు పూనుకోదు. దేశశ్రేయస్సే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తుంది. భారత్‌ శాంతికాముకతను ఎవరైనా చేతకానితనంగా భావిస్తే వారికే నష్టం,” అని అన్నారు. 

చైనా, పాకిస్థాన్‌లు చేతులు కలిపి భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ భారతప్రభుత్వం ఈవిషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గకుండా వాటికి ధీటుగా ఎదురునిలుస్తుండటంతో ఆ రెండు దేశాలు భారత్‌ను ఏవిధంగా ఎదుర్కోవాలో తెలియక యదాతద స్థితిలో నిలిచిపోయాయి. 

కశ్మీర్‌ నుంచి లడ్డాక్‌ను వేరుచేసి రెండు కేంద్రపాలితప్రాంతాలుగా విభజించడం ద్వారా కశ్మీర్‌లో వేర్పాటువాదులను, వారికి అండగా నిలుస్తున్న పాకిస్తాన్ ప్రమేయాన్ని భారత్‌ ప్రభుత్వం కట్టడి చేయగలిగింది. భారత్‌-చైనా సరిహద్దులలో భారీగా సైన్యాన్ని మోహరించడం ద్వారా చైనాకు అడుగు ముందుకు వేయలేని పరిస్థితిని కల్పించింది. 

సరిహద్దులను కాపాడుకొనే విషయంలో మరింత అప్రమత్తంగా ఉన్నామని తెలియజేస్తూ సరిహద్దుల వద్దకు సైనిక బలగాలు, ఆయుధాలు సులువుగా చేరుకొనేందుకు ఈశాన్య రాష్ట్రాలలో కొత్తగా అనేక రహదారులు, వంతెనలు, సొరంగమార్గాలను కేంద్రప్రభుత్వం నిర్మిస్తోంది. కనుక యుద్ధమే అనివార్యమైతే భారత్‌ అందుకు సిద్దంగానే ఉందని అజిత్ ధోవల్ చాలా స్పష్టంగానే చెప్పారనుకోవచ్చు.


Related Post