డబుల్ ఇళ్ళ పంపిణీ మాకూ మంచిదే: బిజెపి

October 27, 2020


img

జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లోని పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను పంచిపెట్టడం ద్వారా టిఆర్ఎస్‌ లబ్దిపొందాలని ఆశించడం సహజం. లబ్ది పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే వాటి పంపిణీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

నిన్న మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళను పంచిపెట్టి జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో లబ్ది పొందాలనుకొంటోందని మాకు తెలుసు. అయితే అవి పంచిపెట్టడం వలన మాకు కూడా మేలు కలుగుతుంది. ఎందుకంటే, నగరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు పొందినవారి కంటే పొందనివారే ఎక్కువమంది ఉన్నారు. టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చి ఆరున్నరేళ్ళవుతున్నా ఇంతవరకు తమకు ఇళ్ళు ఇవ్వనందుకు వారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారందరూ తప్పకుండా మాకే ఓట్లువేస్తారని భావిస్తున్నాము,” అని అన్నారు. 

పేద ప్రజలందరికీ ఇళ్ళు కట్టించి ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదు కనుక దాని శక్తిమేర ఇళ్ళు నిర్మించి ఇస్తుంటుంది. టిఆర్ఎస్‌ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. అయితే ఆ ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు మొదలుపెట్టడం వలననే వాటి నుంచి రాజకీయలబ్ది ఆశిస్తోందని భావించవలసివస్తుంది. మంత్రి జి.కిషన్‌రెడ్డి చెపుతున్నట్లు ఇళ్ళు దక్కనివారు ప్రభుత్వంపై ఆగ్రహం చెందడం కూడా సహజమే. అయితే సాటివారికి ప్రభుత్వం ఇళ్ళు కట్టించి ఇచ్చింది కనుక ఇప్పుడు కాకపోయినా తరువాతైనా తమకు ఇస్తుందని ఆశపడేవారుంటారు. అటువంటి వారందరూ టిఆర్ఎస్‌కే ఓట్లు వేయడం ఖాయం. ఇళ్ళు దక్కనివారు ఒకవేళ జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేయాలనుకొంటే బిజెపికే వేస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే టిఆర్ఎస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌, మజ్లీస్ పార్టీలున్నాయి కదా?


Related Post