దుబ్బాకలో బిజెపిపై టిఆర్ఎస్‌ దృష్టి...అర్ధం ఏమిటో?

October 27, 2020


img

రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌-కాంగ్రెస్ పార్టీల మద్యనే ఉంటుంది. కానీ ఈసారి దుబ్బాక ఉపఎన్నికలలో మంత్రి హరీష్‌రావు బిజెపిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టడం గమనిస్తే బిజెపి నుంచే టిఆర్ఎస్‌ గట్టి పోటీ ఎదుర్కొంటోందని భావించవలసివస్తోంది. 

బిజెపి నేతల ఇళ్ళలో పోలీసులు సోదాలు చేయడం, అదే సమయంలో బయట నుంచి వచ్చిన ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో డబ్బుల కట్టను బిజెపి కార్యకర్తలు పట్టుకోవడం, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం, కరీంనగర్‌ ఎంపీ ధర్మపురి అరవింద్ నిన్న రాత్రి నుంచి జిల్లా కార్యాలయంలో నిర్బందించుకొని దీక్షకు కూర్చోవడం వంటి పరిణామాలను బిజెపికి అనుకూలంగా మలుచుకొనేందుకు ఆ పార్టీ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. కానీ అవే పరిణామాలతో బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావుకు డిపాజిట్లు రాకుండా చేయాలని మంత్రి హరీష్‌రావు భావిస్తుండటం విశేషం. 

కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా సంపాదించిన డబ్బును టిఆర్ఎస్‌ పార్టీ దుబ్బాక ఓటర్లకు విచ్చలవిడిగా పంచిపెడుతుండటమే కాక, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓ పోలీస్ కానిస్టేబుల్ ద్వారా ఆ డబ్బు కట్టలను బిజెపి నేతలు, వారి బందుమిత్రుల ఇళ్ళలో పెట్టించి, వారి ఇళ్ళలో ఆ డబ్బు దొరికిందని చాటింపు వేసుకొని ప్రజలను మభ్యపెట్టేందుకు సిఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులు చాలా నీచమైన కుట్రలు పన్నుతున్నారని కరీంనగర్‌ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర ఆరోపణలు చేశారు. 

పోలీసుల సోదాలలో భారీగా డబ్బు పట్టుబడితే బిజెపి నేతలు ఈ సరికొత్త డ్రామాలు మొదలుపెట్టి, ఓటర్ల సానుభూతిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి హరీష్‌రావు ఆరోపించారు. 

ఏది ఏమైనప్పటికీ, ఈ ఉపఎన్నికలలో 3వ స్థానంలో నిలుస్తుందనుకొన్న బిజెపి ఈ అనూహ్య పరిణామాలతో 1వ లేదా 2వ స్థానం చేరుకొనేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు బిజెపి నేతలు టిఆర్ఎస్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే. దుబ్బాక ఉపఎన్నికలలో ఏ పార్టీ వ్యూహాలు ఫలించాయో...ఎవరివి బెడిసికొట్టాయో తెలియాలంటే నవంబర్‌ 10న ఫలితాలు వెలువడేవరకు ఎదురుచూడాల్సిందే. దుబ్బాకలో నవంబర్‌ 3న పోలింగ్ జరుగుతుంది. 


Related Post