వేడెక్కిన దుబ్బాక రాజకీయాలు

October 27, 2020


img

నిన్న సిద్ధిపేటలో దుబ్బాక బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు, ఆయన మామ, బందువుల ఇళ్ళలో పోలీసులు సోదాలు చేసి రూ.18.67 లక్షలు స్వాధీనం చేసుకొన్నారు. ఈ పరిణామాలపై రఘునందన్ రావు, మంత్రి హరీష్‌రావులు పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో దుబ్బాకలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి.

ఈ పరిణామాలపై మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ, దుబ్బాకలో డిపాజిట్లు కూడా దక్కవని బిజెపి గ్రహించినందునే ఓటర్లకు డబ్బు పంచిపెట్టేందుకు సిద్దమైందని, ఆ సమాచారం తెలుసుకొన్న పోలీసులు బిజెపి నేతల ఇళ్ళలో సోదాలు చేసి డబ్బు స్వాధీనం చేసుకొంటే, బిజెపి నేతలు ఓటర్ల సానుభూతి పొందేందుకు డ్రామాలు చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. డబ్బు పట్టుబడితే తలదించుకోకుండా తిరిగి పోలీసులు, టిఆర్ఎస్‌ పార్టీని నిందించడం చూస్తే దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుందని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. బిజెపి నేతల ఇళ్ళలో ఏమేమి స్వాధీనం చేసుకొన్నారో పోలీసులు ప్రకటించాలని, సోదాల సందర్భంగా తీసిన వీడియోలను కూడా వెంటనే బహిర్గతం చేయాలని మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. బిజెపి...దాని అభ్యర్ధిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. కేంద్రప్రభుత్వం నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి సహాయసహకారాలు అందించి ఉంటే అదే విషయం ప్రజలకు చెప్పుకొని హుందాగా ఓట్లు అడిగితే బాగుండేదని కానీ బిజెపికి ఓట్లు వేసేవారే లేరని గ్రహించడంతో డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభపెట్టి గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు. ఒక జాతీయ పార్టీ అయిన బిజెపి ఈ ఉపఎన్నికలలో గెలిచేందుకు ఇంత నీచానికి దిగజారిపోతుందని ఊహించలేదన్నారు మంత్రి హరీష్‌రావు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావు, బిజెపి నేతలు టిఆర్ఎస్‌పై మండి పడుతున్నారు. ఈ ఉపఎన్నికలలో బిజెపి చేతిలో ఓడిపోతామనే భయంతోనే మంత్రి హరీష్‌రావు పోలీసులను తమ ఇళ్ళపైకి పంపించి, సోదాలు చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు టిఆర్ఎస్‌ కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారు తప్ప నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని రఘునందన్ రావు ఆరోపించారు. దుబ్బాకకు రావలసిన మెడికల్ కాలేజీ, ఇతర ప్రాజెక్టులు అన్నిటినీ మంత్రి హరీష్‌రావు సిద్ధిపేటకు తరలించుకుపోయారని, ఇంతకాలం తీవ్ర వివక్షకు గురైన దుబ్బాక ప్రజలు టిఆర్ఎస్‌ను ఓడించబోతున్నారని గ్రహించి మంత్రి హరీష్‌రావు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. మంత్రి హరీష్‌రావు ఇంకా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన దుబ్బాక ఉపఎన్నికలలో తప్పకుండా గెలిచి బిజెపి సత్తా చూపిస్తానని రఘునందన్ రావు అన్నారు. 

ఈ పరిణామాలతో పోరు టిఆర్ఎస్‌, బిజెపిల మద్యనే జరుగబోతోందా?అనే సందేహం కలుగుతోంది. మరైతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో? 


Related Post