550 కోట్లు పంచుడు...జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసమేనా?

October 19, 2020


img

హైదరాబాద్‌ వరద బాధిత కుటుంబాలను ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.550 కోట్లు తక్షణం విడుదల చేయబోతోంది. పూర్తిగా ఇల్లు కూలిపోయినవారికి లక్షరూపాయలు, పాక్షికంగా ఇల్లు కూలిపోయినవారికి రూ.50,000, వరదనీటి ప్రభావానికి గురైన ఒక్కో ఇంటికి రూ.10,000 చొప్పున అందజేస్తామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. ఈ ఆర్ధికసాయాన్ని మంగళవారం నుంచి బాధితకుటుంబాలకు అందజేస్తామని చెప్పారు. వరదబాధితులకు నిజంగా చాలా అవసరమున్నప్పుడు వారి చేతికి నష్టపరిహారం అందించాలనుకోవడం చాలా సంతోషించదగ్గ విషయమే. ఒకవేళ ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికలు లేకపోయింటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ మొత్తం, ఇంతవేగంగా అందిస్తుందా?అనే సందేహం కలుగకమానదు.

ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో పంటలు నీటమునగడంతో  రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం ప్రకటించలేదు. కానీ హైదరాబాద్‌ వరదబాధితులకు మాత్రమే ఏకంగా రూ.550 కోట్లు మంజూరు చేయడం, తక్షణం దానిని విడుదల చేసి రేపటి నుంచే బాధితకుటుంబాలకు అందజేస్తామని చెప్పడం కాస్త ఆలోచింపజేస్తోంది. 

త్వరలో జరుగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు నగరంలో ఇటువంటి దుస్థితి నెలకొని ఉండటం, ప్రజలు నానా ఇక్కట్లు పడుతుండటం టిఆర్ఎస్‌కు చాలా నష్టం కలిగిస్తుంది. కనుక ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వరద బాధితులకు తక్షణసాయం అందించి వారి ఆగ్రహావేశాలు చల్లార్చి ప్రసన్నం చేసుకోగలిగితే జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఇక టిఆర్ఎస్‌కు తిరుగు ఉండదని వేరే చెప్పక్కరలేదు. ఎన్నికలకు ముందు శాపంగా మారాల్సిన ఈ విపత్కర పరిస్థితులను కూడా టిఆర్ఎస్‌కు అనుకూలంగా మార్చుకోగలగడం సాధారణమైన విషయమేమీ కాదు. ఏది ఏమైనప్పటికీ వరదబాధితులకు సకాలంలో ఆర్ధికసాయం అందుబోతున్నందుకు సంతోషించాల్సిందే.

వీడియో వెలుగు పత్రిక సౌజన్యంతో... 


Related Post