ఖమ్మం బాలిక హత్యాచారం కేసులో కొత్త విషయాలు

October 19, 2020


img

ఖమ్మం రూరల్ జిల్లాలోని పల్లెగూడెంకు చెందిన 13 ఏళ్ళ మైనర్ బాలికపై ముస్తాఫానగర్‌లో ఆమె పనిచేస్తున్న ఇంటి యజమాని కొడుకు గత నెల 18వ తేదీ రాత్రి అత్యాచారం చేసి ఆ తరువాత ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ బాలిక 28 రోజులపాటు ఆసుపత్రిలో చావుబ్రతుకుల మద్య ఊగిసలాడుతూ ఈనెల 15వ తేదీన చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇంటి యజమానిని, ఆయన కొడుకును అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఆ బాలిక తల్లితండ్రులు నిన్న (ఆదివారం) ఖమ్మం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఓ ఫిర్యాదుతో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తమ కూతురి చావుకు తమకు అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా కారణమని ఆ బాలిక తల్లితండ్రులు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసారు. 

పోలీసుల సమాచారం ప్రకారం... ఆ బాలిక తల్లితండ్రులు ఇల్లు కట్టుకొనేందుకు ఓ వ్యక్తి వద్ద 2 లక్షలు అప్పు తీసుకొన్నారు. కానీ వారు ఆ సొమ్మును తిరిగి చెల్లించలేకపోవడంతో ఆ వ్యక్తి వారి మైనర్ కుమార్తెను తనకు అప్పగిస్తే, ఓ ఇంట్లో పనికి కుదిర్చి ఆమె వద్ద నుంచి తన బాకీ తీర్చుకొంటానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి కూతురును అతనికి అప్పగించగా, అతను స్థానిక ముస్తాఫానగర్‌లో అల్లం సుబ్బారావు అనే వ్యక్తి వద్ద రూ.50,000 తీసుకొని ఆ బాలికను అతనికి అప్పగించాడు. అప్పటి నుంచి ఆమె వారి ఇంట్లో పనిమనిషిగా పనిచేయించుకొంటున్నారు. ఆ ఇంటి యజమాని కుమారుడు ఆమెపై అత్యాచారం చేసి, చంపేయాలని ప్రయత్నించడంతో ఈ విషయం బయటకు పొక్కింది. ఇప్పుడు ఆ బాలిక తల్లితండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ వెట్టి చాకిరీ విషయం కూడా బయటకు పొక్కింది. మైనర్ బాలికను తాకట్టు పెట్టి డబ్బు తీసుకొన్న నేరానికి పోలీసులు అతనిపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

మనదేశంలో ఒకప్పుడు ఈవిధంగా తాతముత్తాతలు, తల్లితండ్రులు తీసుకొన్న బాకీలకు వారి పిల్లలను బానిసలుగా మార్చి వెట్టిచాకిరీ చేయించుకొనే దుసంప్రదాయం ఉండేది. ఆ తరువాత దానిని ప్రభుత్వం నిషేదించి నేరంగా ప్రకటించిన తరువాత వెట్టిచాకిరీ విధానం క్రమంగా తగ్గిపోయింది. కానీ ఇంకా ఏదో ఓ రూపంలో కొనసాగుతోందని ఈ తాజా ఘటన నిరూపిస్తోంది.


Related Post