ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు

October 19, 2020


img

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మొత్తం 27 మందితో టిడిపి కేంద్రకమిటీని, మరో 25 మందితో టిడిపి పొలిట్ బ్యూరోను ఏర్పాటుచేశారు. పార్టీ అధికార ప్రతినిధులుగా తెలంగాణ టిడిపి నుంచి ఎమ్మెల్సీ అశోక్ బాబు, జ్యోత్స్న, దీపక్ రెడ్డి, నండూరి నర్సిరెడ్డి, ప్రేమ్‌కుమార్ జైన్, నజీర్‌లకు స్థానం కల్పించారు. 

తెలంగాణ టిడిపికి ఎల్.రమణ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఏర్పడిన రాజకీయపరిణామాలతో రాష్ట్రంలో టిడిపి దాదాపు కనుమరుగైంది. ప్రస్తుతం ఏ ఎన్నికలలోను ఒంటరిగా పోటీ చేయలేని దుస్థితిలో ఉంది. కనుక ఎల్.రమణ కూడా తప్పుకోవాలని అనుకొంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ మళ్ళీ ఆయననే కొనసాగించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.  

రాష్ట్ర విభజన తరువాత ఏపీలో టిడిపి అధికారంలోకి వచ్చినప్పటికీ రాజకీయంగా, పాలనాపరంగా అనేక తప్పటడుగులు వేయడం, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయలేకపోవడంతో 2019 శాసనసభ ఎన్నికలలో వైసీపీ చేతిలో దారుణంగా ఓటమి పాలైంది. అప్పటి నుంచి ఏపీలో కూడా టిడిపి పరిస్థితి క్రమంగా దయనీయంగా మారుతోంది. ఈ పరిస్థితులలో బలమైన నాయకుడిగా పేరొందిన అచ్చెన్నాయుడికి ఏపీ టిడిపి పగ్గాలు అప్పగించడం మంచి నిర్ణయమే అని భావించవచ్చు. ఆయన నేతృత్వంలో ఏపీలో టిడిపి మళ్ళీ కోలుకొని పూర్వవైభవం సాధిస్తుందో లేదో చూడాలి. 


Related Post