కవితమ్మా మీ రాజకీయ నిరుద్యోగ సమస్య తీరింది గాబట్టి...

October 13, 2020


img

నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలుపుతూనే చురకలు వేశారు. “గత 16 నెలలుగా రాజకీయ నిరుద్యోగిగా ఉన్నందుకు మీరు పడిన బాధకు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ముగింపు లభించింది. కనుక రాష్ట్రంలో తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న లక్షలాది నిరుద్యోగులకు ఇకనైనా మీ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించి అదుకొంటుందని ఆశిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు. 

తెలంగాణ ఏర్పడితే ఆంధ్రాకు చెందిన సుమారు లక్షన్నర మంది ఉద్యోగులు ఏపీకి వెళ్లిపోతారు కనుక అన్ని ఖాళీలు ఏర్పడుతాయని, అవి తెలంగాణ ప్రజలకే దక్కుతాయని ఆనాడు టిఆర్ఎస్‌ వాదించింది. టిఆర్ఎస్‌ చెప్పినట్లుగానే ఏపీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వ శాఖలకు వెళ్ళిపోవడంతో వారి స్థానాలు ఖాళీ అయ్యాయి. కానీ తెలంగాణ ఏర్పడి రాష్ట్రంలో టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చి ఆరున్నరేళ్ళవుతున్నా ఇంతవరకు కనీసం లక్ష ప్రభుత్వోద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయింది. ఉద్యోగాల భర్తీ గురించి ప్రతిపక్షాల విమర్శలకు టిఆర్ఎస్‌ మంత్రులు, ప్రజాప్రతినిధులు జవాబు చెప్పలేకపోతున్నారు. 

2018 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.3,000 నిరుద్యోగభృతి చెల్లిస్తామని ప్రకటించింది. సాధ్యం కానీ అటువంటి హామీలను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకోవాలనుకొంటోందని విమర్శించిన టిఆర్ఎస్సే...అదే ఎన్నికలలోనే...తమ పార్టీని గెలిపిస్తే దానికి మరో రూ.16 కలిపి రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక్కొక్కరికీ నెలకు రూ.3,116 నిరుద్యోగభృతి చెల్లిస్తామని ప్రకటించింది. 

అది ఆచరణ సాధ్యం కాదని వాదించినపుడు ఆ హామీ ఇవ్వకూడదు. కానీ ఇచ్చింది. కనుక దానిని తప్పనిసరిగా నిలుపుకోవాలి. కానీ నిలుపుకోలేదు. ఇప్పుడు టిఆర్ఎస్‌ మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ కూడా నిరుద్యోగభృతి హామీ ఊసే ఎత్తడం లేదు! ఎవరైనా దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేస్తుంటారు లేదా ఎదురుదాడి చేసి నోరు మూయిస్తుంటారు. 

సంపత్ కుమార్ ఆక్షేపించినట్లుగా 16 నెలల రాజకీయ నిరుద్యోగంతో కల్వకుంట్ల కవిత ఏవిధంగా మానసిక క్షోభ అనుభవించి ఉంటారో, అదేవిధంగా గత ఆరేళ్ళుగా రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు మానసిక వేదన అనుభవిస్తున్నారు. టిఆర్ఎస్‌ ప్రభుత్వం వారందరికీ ఉద్యోగాలు కల్పించలేకపోతే కనీసం ఇచ్చిన మాటను నిలబెట్టుకొని అందరికీ నిరుద్యోగ భృతి ఇచ్చి ఉంటే నేడు ఎవరూ టిఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని ఈవిధంగా వేలెత్తి చూపగలిగేవారుకారు కదా?



Related Post