దుబ్బాకలో మోడీ మంత్రం...పనిచేస్తుందా?

October 10, 2020


img

అవి దుబ్బాక ఉపఎన్నికలు కావచ్చు.. లేదా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కావచ్చు... లేదా రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా కావచ్చు. వాటిలో తమ ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర బిజెపి నేతలు మోడీ మంత్రం పటిస్తుంటారు. బిజెపి అభ్యర్ధి రఘునందన్ రావుతో సహా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న బిజెపి నేతలందరూ ఇప్పుడు దుబ్బాకలో అదే మంత్రం జపిస్తున్నారు. 

మోడీ హయాంలో శరవేగంగా దేశాభివృద్ధి జరుగుతోందని దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, కొత్త హైవేలు, రైల్వేలైనులు, బ్రిడ్జిలు, సొరంగమార్గాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటివి నిర్మించబడుతున్నాయని, విద్య, వైద్యం, ఆర్ధిక, రక్షణ తదితర అన్ని రంగాలను ప్రక్షాళన చేస్తూ దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారని, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మౌలికవసతుల కల్పన జరుగుతోందని చెపుతున్నారు. ఇవన్నీ నిజమే..అయితే ఏ రోటికాడ ఆ రోటిపాటే పాడాలనే పాత సామెతను బిజెపి నేతలు గ్రహించినట్లు లేరు. దుబ్బాక ఉపఎన్నికలు లేదా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కావచ్చు స్థానిక అంశాలు స్థానిక రాజకీయాల ఆధారంగానే జరుగుతాయని అందరికీ తెలుసు. కనుక దుబ్బాకలో మోడీ మంత్రం జపించడం వలన ప్రయోజనం ఉండకపోవచ్చు. 

సిఎం కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్‌ నేతలలో దాదాపు అందరూ అచ్చమైన తెలంగాణ బాష, యాసలో స్థానిక, రాష్ట్ర స్థాయి సమస్యలు, అభివృద్ధి గురించి మాట్లాడుతూ ప్రజలతో కనెక్ట్ అవుతుంటే, రాష్ట్ర బిజెపి నేతలు జాతీయస్థాయి సమస్యల గురించి మాట్లాడుతూ విలువైన సమయాన్ని వృధా చేసుకొంటున్నారని చెప్పక తప్పదు. కనుక తెలంగాణలో బిజెపి బలం పుంజుకొని నిలదొక్కుకోవాలంటే, ముందుగా అచ్చమైన తెలంగాణ పార్టీగా పరివర్తన చెందాల్సిన అవసరం ఉంది.


Related Post