కార్మికులు తగ్గారు..ఉత్పత్తి పెరిగింది..కానీ లాభాలు తగ్గాయి

October 10, 2020


img

సింగరేణిలో ప్రస్తుతం చాలా విచిత్రమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2018-19లో 49,000 మంది కార్మికులు పనిచేసేవారు. అప్పుడు 62 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. దాంతో సంస్థకు రూ.1,766 కోట్లు లాభాలు వచ్చాయి. అదే..2019-2020లో సుమారు 46,000 మంది కార్మికులే పనిచేస్తున్నారు. కానీ గత ఏడాది కంటే  ఈ ఏడాది అదనంగా మరో రెండు మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేశారు. తక్కువ మందితో ఎక్కువ ఉత్పత్తి జరిగింది కనుక ఇంకా ఎక్కువ లాభాలు రావాలి. కానీ ఈ ఏడాది రూ.933 కోట్లు మాత్రమే లాభాలు వచ్చాయి. సింగరేణి సంస్థ చేసిన ఈ ప్రకటనపై కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. 

కార్మికులు తగ్గి బొగ్గు ఉత్పత్తి రవాణా పెరిగినందున ఈ ఏడాది సింగరేణికి కనీసం రూ.2,000 కోట్లు లాభాలు వస్తాయని భావిస్తే కనీసం గత ఏడాది వచ్చినంతకూడా రాకపోగా ఏకంగా 40 శాతం వరకు తగ్గిపోవడాన్ని సింగరేణి కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము కష్టపడి పనిచేసి సంస్థకు లాభాలు గడించిపెడుతుంటే, ప్రభుత్వ కనుసన్నలలో పనిచేస్తున్న సింగరేణి యాజమాన్యం అప్పనంగా వందల కోట్లా రూపాయలను ప్రభుత్వానికి పంచిపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సింగరేణి యాజమాన్యం లాభాలను తగ్గించి చూపుతూ తమను మోసం చేస్తోందని సింగరేణి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సింగరేణి పరిధిలో మౌలికవసతులు కల్పించి, అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ‘డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్’ అనే పేరుతో 2016-17 నుంచి 2019-2020 వరకు సింగరేణి నుంచి మొత్తం రూ.1,844 కోట్లను తీసుకొంది. కానీ ఆ సొమ్ముతో సింగరేణి పరిధిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా, రాజన్న సిరిసిల్లా, సిద్ధిపేట నియోజకవర్గాలకు మళ్లించి అక్కడ ఖర్చు చేస్తోందని సింగరేణి కార్మికులు ఆరోపిస్తున్నారు.

నియోజకవర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. కానీ సింగరేణి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ రూ.2 కోట్లు చొప్పున సింగరేణి ఫండ్ నుంచే నిధులు కేటాయిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కంటే 2019-2020 ఆర్ధిక సంవత్సరంలో రెట్టింపు సొమ్మును డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ పేరిట ప్రభుత్వం తీసుకోవడం వలననే సింగరేణి యాజమాన్యం లాభాలు తగ్గించి చూపుతోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. 

అసలు సింగరేణి కార్మికులు కష్టపడి సంపాదించిపెడుతున్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా వాడుకొంటుందని ప్రశ్నిస్తున్నారు. సింగరేణి లాభాలపై యాజమాన్యం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

అక్టోబర్ 2017లో జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో సింగరేణిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని, కార్మికుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటామని హామీలు గుప్పించి గెలిచిన టిబిజీకేఎస్, ఇంతవరకు ప్రభుత్వం చేత వాటిని అమలుచేయించలేకపోగా తిరిగి సింగరేణి సొమ్మునే రాష్ట్ర ప్రభుత్వం యధేచ్చగా వాడుకొంటుంటే ప్రశ్నించడంలేదని ఏఐటీయుసీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Related Post