తెలంగాణలో తగ్గనున్న ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు

October 10, 2020


img

సమాన రూట్లలో సమాన కిలోమీటర్లు నడిపించాలని టీఎస్‌ఆర్టీసీ పట్టుబడుతున్న టీఎస్‌ఆర్టీసీ ఎట్టకేలకు పంతం నెగ్గించుకోబోతోంది. ఆ షరతుల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ తన బస్‌ సర్వీసులను తగ్గించుకొనేందుకు సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. 

కరోనాకు ముందు తెలంగాణలో ఏపీఎస్‌ ఆర్టీసీకి చెందిన బస్సులు 2.63లక్షల కిమీ నడుస్తుండగా వాటిని 1.61 కిమీలకు తగ్గించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ షరతు విధించింది. అలాగే సమాన కిమీలతో పాటు సమాన రూట్లలో బస్సులు నడపాలని మరో షరతు విధించింది. అయితే తెలంగాణలో ఏపీఎస్ ఆర్టీసీ 50,000 కిమీ తగ్గించుకొంటుందని, ఆ మేరకు ఏపీలో టీఎస్‌ఆర్టీసీ సర్వీసులు పెంచుకోవడం ద్వారా సరిసమానం చేసుకొందామని ఏపీఎస్ ఆర్టీసీ ప్రతిపాదనను టీఎస్‌ఆర్టీసీ తిరస్కరించడంతో చివరికి విధిలేని పరిస్థితులలో టీఎస్‌ఆర్టీసీ షరతుల ప్రకారమే బస్‌ సర్వీసులను నడిపించడానికి ఏపీఎస్ ఆర్టీసీ సిద్దమవుతోందని సమాచారం. 

ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఇప్పుడు సమాన రూట్లపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. సోమవారం లేదా మంగళవారం హైదరాబాద్‌కు వచ్చి టీఎస్‌ఆర్టీసీ అధికారులతో ఆ ప్రతిపాదనలపై చర్చిస్తారు. ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మద్య వరుసగా నాలుగుసార్లు సమావేశాలు జరిగాయి కానీ విఫలమయ్యాయి. కనుక ఈసారి జరుగబోయే 5వ సమావేశంలోనైనా ఇరువర్గాల మద్య అంగీకారం కుదిరితే దసరా, దీపావళి పండుగలకు ముందు రెండు తెలుగు రాష్ట్రాల మద్య ఆర్టీసీ అంతర్ రాష్ట్ర బస్‌ సర్వీసులు ప్రారంభం అవుతాయి. 

ఏటా దసరా, దీపావళి, సంక్రాంతి, సమ్మక్క సారలమ్మ పండుగలలో టీఎస్‌ఆర్టీసీకి భారీ ఆదాయం వస్తుంటుంది. కానీ గత ఏడాది దసరా దీపావళి పండుగలకు ముందు టీఎస్‌ఆర్టీసీలో సమ్మె మొదలవడంతో ఆ అదనపు ఆదాయం కోల్పోవడమే కాక 55 రోజులపాటు సాగిన సమ్మె కారణంగా తీవ్రంగా నష్టపోయింది. కనుక త్వరలో జరుగబోయే ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశంలో అంగీకారం కుదిరి వెంటనే అంతర్ రాష్ట్ర బస్‌ సర్వీసులు ప్రారంభించగలిగితే ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ రెండూ కూడా భారీగా ఆదాయం పొందగలవు లేకుంటే ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు లబ్ది పొందుతాయి.


Related Post