దుబ్బాకలో టిఆర్ఎస్‌ కారుకు హ్యాండ్ బ్రేకులు

October 09, 2020


img

నవంబర్‌3న జరుగబోయే దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపిలు పోటీ పడుతున్నాయి. అయితే అభ్యర్ధుల బలాబలాలు, పార్టీల వ్యూహాలను బట్టి చూస్తే ఎప్పటిలాగే పోటీ ప్రధానంగా టిఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల మద్యన ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. 

దుబ్బాకలో టిఆర్ఎస్‌ ఇప్పటికే దూసుకుపోతోంది. దానిని ఎదుర్కొని తప్పకుండా విజయం సాధించగలనని కాంగ్రెస్‌ అభ్యర్ధి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నమ్మకంగా ఉన్నారు. ఎందుకంటే దుబ్బాక నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఆయన తండ్రి చెరుకు ముత్యంరెడ్డికి ప్రజలలో మంచి పేరుంది. టిఆర్ఎస్‌లో నుంచి బయటకు వచ్చినందున ఆ పార్టీ లోతుపాట్లు బాగా తెలుసు. ఎన్నడూ లేనివిధంగా ఈ ఉపఎన్నికలలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలందరూ ఆయన గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఉపఎన్నికలు పూర్తయ్యేవరకు దుబ్బాకలోనే బస చేస్తానని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం గమనిస్తే గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత పట్టుదలగా ఉందో అర్ధమవుతుంది. ఇవన్నీ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి సానుకూలాంశాలు కాగా, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ముఖ్యంగా... ఎన్నికల హామీల అమలు చేయకపోవడాన్ని కాంగ్రెస్‌ నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు, నిరుద్యోగ భృతి వంటి అంశాలను గట్టిగా ప్రస్తావిస్తూ, గత ఎన్నికలలో ఇచ్చిన ఆ హామీలనే అమలుచేయకుండా మోసం చేస్తున్న టిఆర్ఎస్‌ను ఏవిధంగా నమ్ముతారని  కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ బిల్లులతో కేంద్రం రైతులను ముంచుతోందని ఆరోపిస్తున్న టిఆర్ఎస్‌ ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ పేరుతో పేదప్రజలపై పెనుభారం మోపుతోందని కాంగ్రెస్‌ నేతలు గుప్పిస్తున్న విమర్శలు ప్రజలను బాగానే ఆకట్టుకొంటున్నాయి. చెరుకు శ్రీనివాస్ రెడ్డి సొంతబలానికి తోడు ఆయనకు మద్దతుగా సీనియర్ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ప్రచారంతో దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ గట్టి పోటీయే ఎదుర్కోవలసివస్తోంది. 

అయితే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కాదని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలి? వేస్తే ఏవిధంగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు? ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రజాసమస్యలను ఏవిధంగా పరిష్కరించగలరు? గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేదా మళ్ళీ టిఆర్ఎస్‌లో చేరిపోతారా? అనే సందేహాలకు ఆయన, ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేతలు కూడా ప్రజలకు సంతృప్తికరమైన జవాబులు చెప్పగలిగితే ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం. 


Related Post