దుబ్బాక పోరు... హరీష్‌రావు జోరు

October 09, 2020


img

ఎప్పటిలాగే మంత్రి హరీష్‌రావు రంగంలో దిగి దుబ్బాక ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సోలిపేట రామలింగారెడ్డి మృతితో ప్రజలలో ఏర్పడే సానుభూతిని ఓట్లుగా మలిచేందుకు ప్రయత్నిస్తూనే, నియోజకవర్గంలో రామలింగారెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ వాటిని కొనసాగించేందుకుగాను ఆయన భార్య సుజాతనే గెలిపించాలని కోరుతున్నారు. అలాగే సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో గత ఆరేళ్ళలో రాష్ట్రం సాధించిన ప్రగతి, రాష్ట్రంలో జరుగుతున్నా పలు అభివృద్ధి కార్యక్రమాల  గురించి వివరిస్తున్నారు. టిఆర్ఎస్‌ అభ్యర్ధి సుజాతకు బదులు తానే ఉపఎన్నికలలో పోటీ చేస్తున్నానని భావించి ఓట్లు వేసి గెలిపించాలని హరీష్‌రావు చేస్తున్న అభ్యర్ధనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, వాస్తవానికి హరీష్‌రావును చూసే జనాలు టిఆర్ఎస్‌కు ఓట్లు వేస్తారని అందరికీ తెలుసు. 

ఓ పక్క ఇటువంటి వాదనలతో ప్రజలను ఆకట్టుకొంటూనే మరోపక్క కాంగ్రెస్‌, బిజెపిలను దెబ్బ తీసేందుకు కూడా హరీష్‌రావు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ముందుగా దుబ్బాక నియోజకవర్గంలోని ఆ రెండు పార్టీల నేతలను, కార్యకర్తలను టిఆర్ఎస్‌లోకి రప్పిస్తూ వాటిని బలహీనపరుస్తున్నారు. టికెట్ ఇవ్వనందుకు టిఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి నమ్మకద్రోహి అని విమర్శలు గుప్పిస్తున్నారు. టిఆర్ఎస్‌ను కాదని ఆయనను గెలిపిస్తే దుబ్బాకకు ఆయన ఏమీ చేయలేడని గట్టిగా చెపుతున్నారు. అభివృద్ధి కావాలంటే టిఆర్ఎస్‌కే ఓటేయలని చేస్తున్న హరీష్‌రావు విజ్ఞప్తి ప్రజలకు బాగానే చేరుతోంది. 

ఇటీవల కేంద్రప్రభుత్వం తెచ్చిన వ్యవసాయబిల్లులను అస్త్రాలుగా బిజెపిపై ప్రయోగిస్తున్నారు. “సిఎం కేసీఆర్‌ రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందజేస్తుంటే, (బిజెపి) ఆ మోటర్లకు మీటర్లు బిగించమంటోంది. ఉచిత విద్యుత్ కావాలా లేక మోటర్లకు మీటర్లు కావాలా?” అంటూ ప్రశ్నిస్తూ బిజెపి అభ్యర్ధి పట్ల ప్రజలలో విముఖత ఏర్పడేలా చేస్తున్నారు. కనుక హరీష్‌రావు వ్యూహాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌, బిజెపిలు మరింతగా చెమటోడ్చవలసి వస్తోందని చెప్పవచ్చు. 


Related Post