ట్రంప్‌..బిడెన్‌..అమెరికన్ల ఓటు ఎవరికో?

October 08, 2020


img

యావత్ ప్రపంచ స్థితిగతులపై ప్రభావం చూపించగల ఏకైక వ్యక్తి అమెరికా అధ్యక్షుడంటే అతిశయోక్తి కాదు. అటువంటి కీలకమైన పదవికి నవంబర్‌ 3వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. అంటే ఎన్నికలకు మరో 25 రోజులు సమయం   మాత్రమే ఉందన్నమాట! ఇటువంటి కీలక సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా సోకడంతో శ్వేతశౌధంలో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే అదునుగా ఆయన ప్రత్యర్ధి జో బిడెన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. 

ఆనవాయితీ ప్రకారం ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అధికార రిపబ్లికన్ పార్టీ  మైక్ పెన్స్, డెమొక్రాట్ అభ్యర్ధి కమలా హారిస్ మద్య బుధవారం మీడియా సమక్షంలో ముఖాముఖీ చర్చ జరిగింది. దానిలో కమలా హారిస్ పైచెయ్యి సాధించినట్లు కనబడ్డారు. అయితే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్‌, జో బిడెన్‌లలో ఇప్పటివరకు డోనాల్డ్ ట్రంప్‌ పైచేయి సాధించినట్లు అమెరికన్ మీడియా సూచిస్తోంది. 

ఒకవేళ డోనాల్డ్ ట్రంప్‌కే మళ్ళీ అధ్యక్షునిగా ఎన్నుకొంటే, ఆయన భారత్‌తో స్నేహపూర్వకంగానే వ్యవహరించవచ్చు కానీ హెచ్-1బీ వీసాల విషయంలో ఇబ్బందిపెట్టడం ఖాయం. అదే జో బిడెన్‌ గెలిచి అధికారంలోకి వస్తే గతంలో బారక్ ఒబామా విధానాలనే మళ్ళీ అమలుచేసే అవకాశం ఉంది. కనుక హెచ్-1బీ వీసాల విషయంలో భారత్‌కు లబ్ది కలుగవచ్చు. ఈ హెచ్-1బీ, హెచ్-4 వీసాలు, గ్రీన్‌ కార్డ్, భద్రత తదితర అంశాల ఆధారంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయులు ఓట్లు వేసేమాటైతే జో బిడెన్ వైపు మొగ్గుచూపవచ్చు. కానీ వారు కూడా అమెరికన్ల మాదిరిగానే ఓ శక్తివంతుడైన నాయకుడు కావాలని కోరుకొంటే డోనాల్డ్ ట్రంప్‌కు ఓట్లు వేసే అవకాశం ఉంది. 

కనుక ప్రవాస భారతీయులు, హెచ్-1బీ వీసాల అంశం, కమలా హారిస్‌ను చూసి జో బిడెన్‌వైపు మొగ్గుతారా లేక అమెరికన్ల వైఖరికి అనుగుణంగా మొండివాడు, దుందుడుకు స్వభావి అయినప్పటికీ మంచి శక్తివంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందిన డోనాల్డ్ ట్రంప్‌కే మళ్ళీ పట్టం కడతారా?అనేది మరో నెలరోజులలో తేలిపోనుంది.


Related Post