ప్రగతిరధ చక్రాలకు సమాన బ్రేకులు..ఇంకా ఎప్పటి వరకో?

October 08, 2020


img

ఆర్టీసీ ప్రగతి రధచక్రాలు పడిన ‘సమాన బ్రేకులు’ ఇప్పట్లో తొలగేలా లేవు. మళ్ళీ నిన్న రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హైదరాబాద్‌లో వరుసగా నాలుగవసారి సమావేశమయ్యి ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీల మద్య నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించారు. అయితే ‘సమాన రూట్లలో సమానదూరం’ బస్సులు తిప్పాలని పట్టుబడుతున్న టీఎస్‌ఆర్టీసీ షరతులకు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు అంగీకరించకపోవడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. 

లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు సుమారు 2.64 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండేవి. కానీ టీఎస్‌ఆర్టీసీ బస్సులు ఏపీలో 1.61 లక్షల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతుండేవి. కనుక ఆ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ కూడా తెలంగాణలో తమ సర్వీసులను తగ్గించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ కోరుతోంది. ఆ ప్రతిపాదనపై స్పందించిన ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణలో తాము 50,000 కిమీ మేర సర్వీసులు తగ్గించుకొంటామని, టీఎస్‌ఆర్టీసీ ఏపీలో 50,000 కిమీ సర్వీసులు పెంచుకోవాలని మొదట ప్రతిపాదించారు. దానికి టీఎస్‌ఆర్టీసీ అంగీకరించలేదు. ఇప్పటికే తీవ్ర నష్టాలలో ఉన్న తాము ఏపీలో సర్వీసులు పెంచలేమని, పెంచడం వలన మరింత నష్టాలు మూటగట్టుకోవడం తప్ప తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదని కనుక ఏపీఎస్ ఆర్టీసీయే తెలంగాణలో తమ సర్వీసులను తగ్గించుకోవాలని పట్టుబడుతోంది. 

నిన్న జరిగిన సమావేశానికి హాజరైన ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తెలంగాణలో మరో 56,000 కిమీ తగ్గించుకోవడానికి సిద్దమని తెలియజేశారు. కానీ సమాన రూట్లలో సమానదూరం బస్సులు తిప్పాలని టీఎస్‌ఆర్టీసీ పట్టుబట్టడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. మళ్ళీ రెండు రోజుల తరువాత మరోసారి సమావేశమవుదామని చెప్పి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వెళ్ళిపోయారు. 

కనుక ఆర్టీసీ ప్రగతి రధచక్రాలు పడిన ఈ సమాన బ్రేకులు ఇంకా ఎప్పటికీ తొలుగుతాయో తెలీని పరిస్థితి నెలకొంది. ఆ బ్రేకులు తొలగితే తప్ప ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య అంతర్ రాష్ట్ర ఆర్టీసీ బస్ సర్వీసులు ప్రారంభం అయ్యే అవకాశం లేదు.


Related Post