శశికళకు ఐ‌టి షాక్... రూ.2,000 కోట్లు ఆస్తులు సీల్

October 08, 2020


img

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు ఆదాయపన్ను శాఖ పెద్ద షాక్ ఇచ్చింది. ఆమెకు చెందిన సుమారు రూ.2,000 కోట్లు విలువగల ఆస్తులను స్తంభింపజేసింది. తమిళనాడులో కొడనాడు, సిరుతవూర్ ప్రాంతాలలో గల ఆస్తులను స్తంభింపజేస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ నోటీసులు పేర్కొంది. వాటికి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు యజమానులుగా గుర్తించామని, బినామీ నిరోధక చట్టం క్రింద వాటిని స్తంభింపజేస్తున్నామని నోటీసులలో పేర్కొన్నారు. వాటిపై ఈ వివాదం ముగిసే వరకు ఇకపై ఎవరూ ఎటువంటి లావాదేవీలు జరుపరాదని నోటీసులలో పేర్కొన్నారు.      

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితురాలిగా ఉన్నందుకే శశికళ ఇన్నివేల కోట్లు విలువైన ఆస్తులను పోగేసుకోగలిగారంటే, ఆమే తమిళనాడుకు ముఖ్యమంత్రి అయితే ఇంకెంత పోగేసుకొనేవారో?అనే భావన కలుగక మానదు. గత శాసనసభ ఎన్నికలలో జయలలిత తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడం, పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు (2016లో) అకస్మాత్తుగా ఆసుపత్రి పాలవడం, ఆమె ఆసుపత్రిలో ఉన్నంత కాలం ఎవరినీ కలవనీయకుండా శశికళ అడ్డుకోవడం, ఆసుపత్రిలో ఉండగానే జయలలిత చనిపోవడం, ఆ తరువాత శశికళ అన్నాడీఎంకె పార్టీని, ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించడం వంటి వరుస పరిణామాలను చూసినవారు జయలలిత మరణం వెనుక శశికళ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 

కానీ జయలలిత మరణించిన వెంటనే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి చురుకుగా పావులు కదుపుతుండగా, అక్రమస్తుల కేసులో జైలుకి వెళ్ళవలసి వచ్చింది. నాలుగేళ్ళు జైలు శిక్ష పూర్తిచేసుకొని జనవరి 2021లో విడుదల కావలసి ఉంది. ఆమె జైలు నుంచి బయటకు వస్తే మళ్ళీ తమిళనాడు రాజకీయాలను శాశించడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు. ఆమె విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడులో ఆమె వర్గీయుల హడావుడి పెరిగిపోతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఆదాయపన్ను శాఖ శశికలకు ఈ షాక్ ఇవ్వడం గమనిస్తే మళ్ళీ ఏదో జరుగబోతోందని అర్ధమవుతోంది. 

కేంద్రం కనుసన్నలలో పనిచేస్తున్న అధికార అన్నాడీఎంకే పార్టీ మెల్లగా రాష్ట్రం, రాష్ట్ర రాజకీయాలపై మెల్లగా పట్టుసాధిస్తోంది. కనుక ఈ సమయంలో శశికళ జైలు నుంచి విడుదలై బయటకు వస్తే, ఆమె పళనిస్వామి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అధికారం చేజిక్కించుకొనే ప్రయత్నాలు చేయవచ్చు. అదీగాక వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. కనుక ఆమెను మరికొన్నేళ్ళు జైలులో ఉంచేందుకే ఇప్పటి నుంచే రంగం సిద్దం చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో రానున్న రోజులలో తేలిపోతుంది.


Related Post