దుబ్బాక ఎన్నికల ప్రచారంలో మోత్కుపల్లి

October 07, 2020


img

టిడిపిలో ఓ వెలుగువెలిగిన మోత్కుపల్లి నర్సింహులు ఆ తరువాత చాలా కాలంపాటు రాజకీయాలలో వెనకబడిపోయారు. 2018 ముందస్తు ఎన్నికలలో ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత ఆయన మళ్ళీ రాజకీయ చౌరస్తాకు చేరుకొన్నారు. సరిగ్గా అదే సమయంలో బిజెపి నుంచి ఆహ్వానం అందడంతో ఎగిరిగంతేసి ఆ పార్టీలో చేరిపోయారు కానీ బిజెపి నేతల సమావేశాలలో ఆయన కనిపించిన దాఖలాలు లేవు. దాంతో ఆయన ఏ పార్టీలో ఉన్నారో జనాలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. 

మంగళవారం చేగుంటలో జరిగిన బిజెపి సమావేశంలో పాల్గొని మోత్కుపల్లి నర్సింహులు మళ్ళీ తన ఉనికిని చాటుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ చాలా దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. ఎన్నికల హామీలను అమలుచేయకుండా ఎల్ఆర్ఎస్‌తో పేదల నడ్డి విరుస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నికలలో ప్రజలు బిజెపిని గెలిపించి సిఎం కేసీఆర్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలి,” అని అన్నారు. 

ఇప్పుడు టిఆర్ఎస్‌ను సిఎం కేసీఆర్‌ పాలనను విమర్శిస్తున్న మోత్కుపల్లి నర్సింహులు, గతంలో అదే టిఆర్ఎస్‌లో చేరేందుకు విఫలయత్నాలు చేశారు. ఆ తరువాత అదే టిఆర్ఎస్‌లో టిడిపిని విలీనం చేయాలని సూచించి పార్టీలో నుంచి బహిష్కరించబడ్డారు. ఆ తరువాత 2018 శాసనసభ ఎన్నికలలో ‘సిఎం కేసీఆర్‌ కోరితే తాను టిఆర్ఎస్‌ తరపున ఎన్నికల ప్రచారం చేసి కనీసం 10 నియోజకవర్గాలలో టిఆర్ఎస్‌ను గెలిపిస్తానని’ ఆఫర్ ప్రకటించారు. అంటే తనను గుర్తించి గౌరవిస్తే టిఆర్ఎస్‌కు సేవ చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెపుతున్నట్లు అర్ధమవుతోంది. కానీ టిఆర్ఎస్‌ ఆయన మాటలను, ఆఫర్లను పట్టించుకోలేదు. ప్రస్తుతం ఆయన బిజెపిలో ఉన్నందునే టిఆర్ఎస్‌, సిఎం కేసీఆర్‌ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నారని భావించవచ్చు. 


Related Post