కాంగ్రెస్‌లో చేరిన చెరుకు... దుబ్బాక నుంచి పోటీ?

October 06, 2020


img

టిఆర్ఎస్‌ సీనియర్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంగళవారం సాయంత్రం టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుబ్బాక ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆయనకు టికెట్ ఖరారు అయినట్లు తాజా సమాచారం. కనుక తూమకుంట నర్సారెడ్డిని పక్కన పెట్టినట్లే భావించవచ్చు. రేపు ఉదయం కాంగ్రెస్‌ అభ్యర్ధిని ప్రకటిస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. 

కాంగ్రెస్‌ సీనియర్ నేత దామోదర రాజనరసింహ పార్టీ నేతలకు నచ్చజెప్పి ఒప్పించి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి రప్పించి పార్టీ టికెట్ ఇప్పించినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నికలలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కూడగట్టి టిఆర్ఎస్‌ను ఓడించగలరని రాజనరసింహ గట్టిగా నచ్చచెప్పడంతో ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నికలలో ఎలాగైనా టిఆర్ఎస్‌ను ఓడించగలిగితే, కేసీఆర్‌ పాలన పట్ల ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉందనే కాంగ్రెస్‌ వాదనకు బలం చేకూరుతుందని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అందుకే నర్సారెడ్డిని పక్కన పెట్టి చివరి నిమిషంలో వచ్చిన చెరుకు శ్రీనివాస్ రెడ్డిని బరిలో దింపబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుబ్బాకలో మీడియాతో మాట్లాడుతూ, “చెరుకు శ్రీనివాస్ రెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. ఆయన తండ్రిగారు చెరుకు ముత్యంరెడ్డి తెలంగాణకే ఆదర్శప్రాయులు. దుబ్బాక ఉపఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు టిఆర్ఎస్‌ అప్పుడే నగదు, మద్యం పంపిణీ చేస్తోంది. వాటిని ఎవరు పంపిణీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధికే ఓట్లు వేసి గెలిపించాలని దుబ్బాక ప్రజలను కోరుతున్నాను. పార్టీ అభ్యర్ధి గుణగణాలను బట్టి కాక తన మొహం చూసి టిఆర్ఎస్‌ అభ్యర్ధికి ఓటు వేయాలని మంత్రి హరీష్‌రావు ఓటర్లను కోరడం గమనిస్తే టిఆర్ఎస్‌లో అభ్యర్ధులకు ఎటువంటి విలువ ఉండదని అర్ధమవుతోంది. దుబ్బాక ఉపఎన్నికలు కేవలం ఏదో ఓ పార్టీ అభ్యర్ధిని ఎన్నుకోవడానికి జరుగుతున్నవిగా మాత్రమే చూడరాదు. సిఎం కేసీఆర్‌ నియంతృత్వ, కుటుంబపాలనను వ్యతిరేకిస్తున్నామని చాటి చెప్పేందుకు ఈ ఉపఎన్నికలు ఓ అవకాశంగా భావించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.


Related Post