అప్పుడు వద్దని ఇప్పుడు నిందించడమెందుకు?బండి ప్రశ్న

October 06, 2020


img

సిఎం కేసీఆర్‌ నదీజలాల పంపకాల విషయంలో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేవిధంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. నిన్న ఆయన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ, “కృష్ణా,గోదావరి జలాలలో తెలంగాణకు న్యాయంగా రావలసిన నీటిని వదులుకొన్నది సిఎం కేసీఆరే. ఏపీ తనకు కేటాయించిన నీటికంటే అదనంగా వాడుకొంటున్నా సిఎం కేసీఆర్‌ పట్టించుకోలేదు. ఈ జలవివాదాలలో కేంద్రం, సుప్రీంకోర్టుల జోక్యం, పెత్తనం లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులం కూర్చొని మాట్లాడుకొని అన్ని సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకొంటానని చెప్పింది కేసీఆరే! ఇప్పుడు ఆయనే కేంద్రాన్ని జలవివాదాలు పరిష్కరించడం లేదని నిందిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్‌ సమావేశాలకు అజెండా పంపించమని కేంద్రం అడిగితే చివరి నిమిషం వరకు పంపించరు. దానర్ధం ఏమిటి? టిఆర్ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులలో భారీగా అవినీతి జరిగింది. మేము ఆ వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపిస్తున్నాము. సరైన సమయం వచ్చినప్పుడు కేంద్రం తగిన చర్యలు తీసుకొంటుంది. అధికారంలో ఉన్నామని టిఆర్ఎస్‌ నేతలు చాలా అహంభావంతో విర్రవీగుతున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది. అప్పుడు వారి పరిస్థితి ఏమిటో ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది,” అని తీవ్రంగా విమర్శించారు.  

రెండు తెలుగు రాష్ట్రాల మద్య జలవివాదాలు నెలకొని ఉన్నప్పుడు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడమే ఉత్తమమైన మార్గం. కానీ కేసీఆర్‌, జగన్ స్నేహం మూన్నాళ్ళ ముచ్చటగా మారడంతో సమస్యలు మళ్ళీ మొదటికి వచ్చాయి. దాంతో మళ్ళీ ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు, కేంద్రానికే చేరింది. 

కృష్ణా,గోదావరి జలాలను వ్యవసాయం కోసం వినియోగించుకోవాలనుకోవడం సహజమే. కానీ ఇక్కడ టిఆర్ఎస్‌, అక్కడ వైసీపీ ప్రభుత్వాలు ఈ నీటి వ్యవహారాలను రాజకీయ ప్రయోజనాలకు కూడా వినియోగించుకోవాలనుకోవడం వలననే సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పవచ్చు. ఉదాహరణకు దుబ్బాక ఉపఎన్నికలు దగ్గర పడుతున్నందున, నదీ జలాల పంపకాల గురించి సిఎం కేసీఆర్‌తో సహా టిఆర్ఎస్‌ నేతలు మరింత గట్టిగా మాట్లాడుతుండటం అందరూ గమనించే ఉంటారు. అక్కడ ఏపీలో కూడా వైసీపీ-టిడిపిల మద్య భీకర రాజకీయయుద్ధాలు జరుగుతున్నాయి. కనుక ఏపీకి రావలసిన నీటివాటాల విషయంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఏమాత్రం వెనక్కు తగ్గలేని పరిస్థితిలో ఉంది. ఒకవేళ వెనక్కు తగ్గితే టిడిపిది పైచేయి అవుతుంది. కనుక వైసీపీ ప్రభుత్వం కూడా నీటి పంపకాల గురించి గట్టిగా మాట్లాడక తప్పదు. ఈవిధంగా రాజకీయ కారణాలతో రెండు రాష్ట్రాలు వెనక్కు తగ్గలేని పరిస్థితులలో ఉన్నప్పుడు సమస్యలు  పరిష్కారం కావు కనుక ఇటువంటి ‘అపెక్స్ పంచాయితీలు’ తప్పవు. కానీ అక్కడా ఈ సమస్యలు పరిష్కరించబడతాయని ఆశించడం అత్యాసే అవుతుంది.


Related Post