ఏపీ, టీఎస్‌ఆర్టీసీ మద్య మరో కొత్త లొల్లి

October 06, 2020


img

కేంద్రప్రభుత్వం అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతించి చాలా కాలమే అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీల మద్య ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతున్నందున నేటికీ ఏపీఎస్, టీఎస్‌ఆర్టీసీ బస్సులు నదువడం లేదు. ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీలో తలెత్తిన మరో కొత్త సమస్య టీఎస్‌ఆర్టీసీ మెడకు కూడా చుట్టుకొంది. 

ఏపీఎస్ ఆర్టీసీని రెండుగా విభజన చేసినపుడు ఏపీకి చెందిన డ్రైవర్లు, కండెక్టర్లు, శ్రామిక్‌లను ఏపీఎస్ ఆర్టీసీకి, అదేవిధంగా తెలంగాణకు చెందినవారిని టీఎస్‌ఆర్టీసీకి కేటాయించారు. ఆవిధంగా ఏపీఎస్ ఆర్టీసీకి బదిలీ అయినవారిలో కొందరిని మళ్ళీ టీఎస్‌ఆర్టీసీకి వెళ్ళిపోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు వారికి తెలంగాణలోనే పోస్టింగ్ లభించింది కనుక వారు టీఎస్‌ఆర్టీసీకి తిరిగి వెళ్ళిపోవాలని ఉత్తర్వుల సారాంశం. 

దాంతో నోటీసులు అందుకొన్న ఆర్టీసీ కార్మికులు లబోదిబోమంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులపై  హైకోర్టు స్టే విధించడంతో వారికి ఊరట లభించింది. కానీ ఏపీ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడంతో వారిలో మళ్ళీ ఆందోళన మొదలైంది. 

ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా కోరుతూ టీఎస్‌ఆర్టీసీకి నోటీస్ పంపించింది. ఏపీఎస్ ఆర్టీసీలో మొదలైన ఈ సమస్యతో టీఎస్‌ఆర్టీసీకి ఎటువంటి సంబందమూ లేనప్పటికీ అనవసరంగా న్యాయస్థానం చుట్టూ తిరగవలసివస్తుంది. 

నిజానికి ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. కనుక దానిలో పనిచేస్తున్నవారికి నెలనెలా జీతాలు చెల్లించడమే కష్టంగా మారింది. ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ నుంచి కార్మికులు కూడా తిరిగివస్తే వారిని సంస్థ భరించలేదు కనుక వారిని తీసుకొనే ప్రసక్తి లేదు. 

ఏపీలో జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వం (రవాణాశాఖ)లో విలీనం చేసి, ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులందరినీ ప్రభుత్వోద్యోగులుగా పరిగణించి ఆ స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తున్నారు. కనుక టీఎస్‌ఆర్టీసీతో పోలిస్తే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి చాలా గొప్పగా ఉందని అర్దమవుతోంది. కనుక దానిలో పనిచేస్తున్న కార్మికులు ఎవరూ టీఎస్‌ఆర్టీసీలో తిరిగి వెళ్ళాలనుకోరని వేరే చెప్పక్కరలేదు. 

అయితే నష్టాలలో మునిగి ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అవివేకమని, దాని వలన ప్రభుత్వంపై భారీగా ఆర్ధికభారం పడుతుందని కనుక టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయదలచుకోలేదని సిఎం కేసీఆర్‌ ఆనాడే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. కానీ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అయితే అది మూన్నాళ్ళ ముచ్చటే కావచ్చని ఆనాడే సిఎం కేసీఆర్‌ అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో కార్మికులను టీఎస్‌ఆర్టీసీకి తిప్పి పంపించివేసి భారం తగ్గించుకోవాలనుకోవడం చూస్తే ఆనాడు సిఎం కేసీఆర్‌ చెప్పిన్నట్లే  జరుగుతున్నట్లుంది. 


Related Post