నేడే అపెక్స్ కౌన్సిల్‌..ఏపీ, తెలంగాణ సిఎంల భేటీ

October 06, 2020


img


కృష్ణా, గోదావరి నదీజలాల పంపకాలపై చిరకాలంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ సమస్యలపై చర్చించి ఓ పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ అధ్యక్షతన ఇవాళ్ళ మధ్యాహ్నం 12 గంటలకు అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగబోయే ఈ సమావేశంలో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొని ముఖాముఖీ చర్చించబోతున్నారు.

ఈ సమావేశంలో ఆధారాలు, గణాంకాలతో సాయంతో ఏపీ, కేంద్రప్రభుత్వాల తీరును  గట్టిగా ఎండగడతానని ఇప్పటికే సిఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నదీజలాల విషయంలో మాటిమాటికీ తెలంగాణతో కయ్యాలకు దిగుతున్న ఏపీ ప్రభుత్వం మళ్ళీ మరోసారి తెలంగాణవైపు కన్నెత్తి చూడకుండా చేస్తానని సిఎం కేసీఆర్‌ అన్నారు. అలాగే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు నదీ జలాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్న కేంద్రాన్ని కూడా ఈ సమావేశంలో ఎండగడతానని సిఎం కేసీఆర్‌ అన్నారు.

అయితే ఎగువ రాష్ట్రమైన తెలంగాణలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు సాగునీటి ప్రాజెక్టులు కట్టుకొంటుంటే దిగువ రాష్ట్రమైన ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందని, కనుక తెలంగాణలో నిర్మితమవుతున్న  ప్రాజెక్టుల గురించి, అలాగే ఏపీకి న్యాయంగా రావలసిన నీటి గురించి, ఏటా వృధాగా సముద్రం పాలవుతున్న నీటిని వినియోగించుకోవడం గురించి ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశంలో మాట్లాడుతారని సమాచారం. 

నీటి లభ్యత, సాగునీరు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సిఎం కేసీఆర్‌కున్నంత పట్టు, అవగాహన ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి లేవనే చెప్పవచ్చు. కనుక ఇవాళ్ళ జరుగబోయే అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంలో సిఎం కేసీఆర్‌ పైచేయి సాధించవచ్చు. కానీ ఈ సమావేశంతో ఏవో అద్భుతాలు జరిగిపోతాయని ఆశించడం అత్యాసే అవుతుంది. బహుశః ఇది కూడా మరో రోజువారీ సమావేశంలా ముగిసినా ఆశ్చర్యం లేదు. 


Related Post