మేం గెలిస్తే రిఫరెండం.. ఓడిపోతే కాదు: జగ్గారెడ్డి

October 05, 2020


img

సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చినతాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “దుబ్బాక ఉపఎన్నికలను టిఆర్ఎస్‌ పాలనకు రిఫరెండంగానే భావిస్తాము. టిఆర్ఎస్‌ నిరంకుశ పాలనతో వేసారిపోయున్న ప్రజలు ఈ ఉపఎన్నికలలో ఆ పార్టీకి గట్టిగా బుద్ది చెప్పబోతున్నారు. టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ పార్టీయే అని ప్రజలు భావిస్తున్నారు కనుక ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం తధ్యం అని మేము భావిస్తున్నాము,” అని అన్నారు. 

“ఈ ఉపఎన్నికలను టిఆర్ఎస్‌ పాలనకు రిఫరెండంగా చెపుతున్నారు కనుక ఒకవేళ ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అప్పుడు ప్రజలు టిఆర్ఎస్‌వైపే ఉన్నారని మీరు అంగీకరిస్తారా?” అనే ప్రశ్నకు జగ్గారెడ్డి చాలా విచిత్రమైన సమాధానం చెప్పారు. 

“ఒకవేళ ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అప్పుడు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావించలేము. ఎందుకంటే సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీయే ఉపఎన్నికలలో గెలుస్తుంటుంది కనుక! కనుక మేము గెలిస్తేనే అది రిఫరెండం అవుతుంది టిఆర్ఎస్‌ గెలిస్తే అది సహజమైన గెలుపు అవుతుంది,” అని జవాబిచ్చారు. 

“అధికారంలో ఉన్నపార్టీయే ఉపఎన్నికలలో గెలుస్తుంటుందని మీరు చెప్పారు కనుక కాంగ్రెస్ పార్టీ ముందే ఓటమికి సిద్దపడిందా?ముందే ఓటమిని అంగీకరించినట్లు భావించవచ్చా?” అనే ప్రశ్నకు జగ్గారెడ్డి బదులిస్తూ, “ఈ ఉపఎన్నికలలో మేము తప్పకుండా గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాము. గెలిచేందుకు మా ప్రయత్నం మేము చేస్తాము,” అని చెప్పారు. 

ఈ ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని జగ్గారెడ్డి గట్టిగా చెప్పలేకపోతున్నారు. కనీసం ఈ ఉపఎన్నికలు టిఆర్ఎస్‌ పాలనకు రిఫరెండం అన్ని గట్టిగా చెప్పలేకపోతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పరిస్థితికి ఇది అద్దంపడుతోందనుకోవాలా?


Related Post