పాక్‌, చైనాలతో ఒకేసారి యుద్ధానికి రెడీ: ఐఏఎఫ్ చీఫ్ భదూరియా

October 05, 2020


img

ఒకవేళ పాక్, చైనాలు కలిసి భారత్‌పై యుద్ధానికి వచ్చినా రెంటినీ ఏకకాలంలో ఎదుర్కోగల శక్తి భారత వాయుసేనకు ఉందని వాయుసేన చీఫ్ ఆర్‌కేఎస్‌ భదూరియా అన్నారు. 

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సరిహద్దుల వద్ద చైనా దూకుడు పెరిగినప్పటి నుంచి మన ఆర్మీ, వాయుసేనలు ధీటుగా స్పందిస్తున్నాయి. అత్యాధునికమైన, శక్తివంతమైన రఫేల్ యుద్ధ విమానాలు చేతికి అందిన తరువాత భారత వాయుసేన మరింత శక్తివంతంగా మారింది. సరిహద్దులలో పాకిస్థాన్‌, చైనాలు కలిసి చేస్తున్న సైనిక విన్యాసాలను చూస్తే ఆ రెండు దేశాలు కూడబలుక్కొని భారత్‌పై యుద్ధానికి రావాలనుకొంటున్నట్లు భావిస్తున్నాము. ఒకవేళ అవి కూడబలుక్కొని మనపై దండయాత్రకు వచ్చినా రెంటినీ ఏకకాలంలో ఎదుర్కొని సమర్ధంగా తిప్పికొట్టగల శక్తి మన వాయుసేనకుంది,” అని అన్నారు.

పాక్‌, చైనాలు రెండూ ఎప్పటి నుంచో భారత్‌కు వ్యతిరేకంగా విడివిడిగా కుట్రలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రెండూ బహిరంగంగానే చేతులు కలిపాయి. సరిహద్దులలో కొండప్రాంతాలలో ఏవిధంగా యుద్ధం చేయాలో చైనా సైనికులకు పాక్‌ ఆర్మీ కమాండోలు శిక్షణ ఇస్తున్నట్లు భారత్‌ నిఘావర్గాలు గుర్తించాయి. అవి నిజంగా భారత్‌తో యుద్ధానికే సన్నాహాలు చేసుకొంటున్నాయో లేదా కేవలం భారత్‌ను బెదించేందుకే సరిహద్దు ప్రాంతాలలో కలిసి సైనిక విన్యాసాలు చేస్తున్నాయో తెలియదు కానీ భారత్‌కు వ్యతిరేకంగా ఆ రెండు చేతులు కలిపాయనేది స్పష్టం అయ్యింది. కనుక భారత్‌ కూడా వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగానే ఉందనే సందేశం వాటికి పంపడం చాలా అవసరం కనుకనే వాయుసేన చీఫ్ ఆర్‌కేఎస్‌ భదూరియా ఈవిధంగా చెప్పి ఉంటారనుకోవచ్చు. 

కరోనాతో తిప్పలు పడుతున్న భారత్‌ ఎక్కువకాలం సరిహద్దులవద్ద సైనికులను, యుద్ధవిమానాలు, యుద్ధ ట్యాంకులను మోహరించలేదని కనుక భారత్‌ వెనక్కు తగ్గగానే ఎప్పటిలాగే మరికొంత భారత్‌ భూభాగం ఆక్రమించి సరిహద్దులను మార్చాలని చైనా భావించింది. కానీ చైనా అంచనాలకు భిన్నంగా భారత్‌ గత 4-5 నెలలుగా సైన్యాన్ని ఆయుధసంపత్తిని మోహరించడమే కాక, రాబోయే చలికాలమంతా కూడా సరిహద్దుల నుంచి కదలకుండా చైనాను నిలువరించేందుకు సన్నాహాలు చేసుకొంటోంది. కనుక ఎటువంటి ప్రతికూల పరిస్థితులలో కూడా భారత్‌ వెనకడుగువేయదని చైనాకు ఈపాటికే అర్ధమయ్యుండాలి. కానీ సరిహద్దుల వద్ద సైన్యాన్ని పెంచుతూ చాలా మూర్ఖంగా వ్యవహరించడమే కాకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ, ఆయుధాలు అందజేస్తున్న పాకిస్థాన్‌తో చేతులు కలిపి అంతర్జాతీయంగా తన పరువుప్రతిష్టలను తానే దిగజార్చుకొంటోంది.


Related Post