టిఆర్ఎస్‌కు చెరుకు గుడ్ బై?

October 05, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలకు ముందు అధికార టిఆర్ఎస్‌కు చిన్న షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఉపఎన్నికలలో పోటీ చేయాలనుకొన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి అవకాశం లేదని గ్రహించడంతో టిఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైపోయారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయనను స్వాగతించినట్లు సమాచారం. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే దుబ్బాక ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా అవకాశం కల్పించాలనే ఆయన షరతుపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నికలకు తూమకుంట నర్సారెడ్డి పేరును రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు నిన్న ఖరారు చేసినప్పటికీ, ఈ తాజా పరిణామం కారణంగానే ఆయన పేరును ప్రకటించలేదని తాజా సమాచారం. 

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడే చెరుకు శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ్ళ ఉదయం ఆయన హైదరాబాద్‌లో తన అనుచరులతో సమావేశమై కాంగ్రెస్‌లో చేరడంపై చర్చించారు. ఇవాళ్ళ రాత్రిలోగా ఆయన తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఒకవేళ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకు లేకుంటే నర్సారెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.    

దుబ్బాక నుంచి మాజీ టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి భార్యను బరిలో దించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. అయితే ఆ ప్రతిపాదనను టిఆర్ఎస్‌లో పలువురు వ్యతిరేకిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమేనని ఈ తాజా పరిణామం తెలియజేస్తోంది. 

ఒకవేళ ఈ కీలక తరుణంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరితే టిఆర్ఎస్‌కు నష్టమే... కాంగ్రెస్ పార్టీకి లాభమే.  అయితే ఒకవేళ చెరుకు ఇప్పుడు చేజారిపోయినా టిఆర్ఎస్‌కు ఆ నష్టాన్ని తట్టుకొని కాంగ్రెస్‌ను ఎదుర్కొని గెలువగలిగే శక్తి ఉంది. కానీ ఎన్నికలలో ఒకవేళ ఆయనే గెలిస్తే కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా లేదా మళ్ళీ టిఆర్ఎస్‌లోకి జంప్ అయిపోతారో తెలియదు. గత అనుభవాల దృష్ట్యా అదే జరిగే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు ఆలోచించుకోవలసింది కాంగ్రెస్ పార్టీయే తప్ప టిఆర్ఎస్‌ కాదని చెప్పక తప్పదు.


Related Post