కేసీఆర్‌తో పోటీపడిన నర్సారెడ్డి...

October 05, 2020


img

దుబ్బాక ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా తూమకుంట నర్సారెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. నేడో రేపో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయారు. కానీ అప్పటికే అత్యంత శక్తివంతుడైన రాజకీయ నేతగా పేరున్న కేసీఆర్‌పై పోటీ చేసిన ఘనత దక్కించుకొన్నారు. బహుశః అదే ఇప్పుడు ఆయనకు ఈ అవకాశం తెచ్చిపెట్టిందని భావించవచ్చు. కేసీఆర్‌తోనే పోటీకి దిగిన నర్సారెడ్డిని దుబ్బాక ఉపఎన్నికలలో బరిలో దింపితే ఈసారి తప్పకుండా టిఆర్ఎస్‌, బిజెపి అభ్యర్ధులను ఓడిస్తారనే నమ్మకంతోనే ఆయనను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

కేసీఆర్‌ చేతిలో ఆయన ఓడిపోయినప్పటికీ కేసీఆర్‌ దృష్టిని బాగా ఆకర్షించగలిగారు. అందుకే ఆయనను కాంగ్రెస్‌ నుంచి టిఆర్ఎస్‌లోకి రప్పించి తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. కానీ 2018 శాసనసభ ఎన్నికలకు ముందు ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దపటడంతో ఆయనను టిఆర్ఎస్‌ పార్టీ బహిష్కరించింది. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నారు. ప్రస్తుతం సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. నిన్న హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మెదక్, సిద్ధిపేట జిల్లాల కాంగ్రెస్‌ నేతలు ఆయన అభ్యర్ధిత్వాన్ని బలపరచడంతో ఆయన పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

నర్సారెడ్డి సుమారు నాలుగేళ్ళు టిఆర్ఎస్‌లో పనిచేసినందున ఆ పార్టీ బలాలు, బలహీనతల గురించి మంచి అవగాహనే కలిగి ఉంటారు. కనుక ఆయన టిఆర్ఎస్‌ వ్యూహాలను ఎదుర్కొంటూ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బిజెపి అభ్యర్ధిగా చెప్పుకోబడుతున్న రఘునందన్ రావు కూడా దుబ్బాక ఉపఎన్నికలలో గెలుపు కోసం చాలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. కనుక ఈసారి ఉపఎన్నికలలో గెలుపు కోసం టిఆర్ఎస్‌ మరింత కష్టపడవలసి రావచ్చు.


Related Post