కేసీఆర్‌ గట్టిగానే చెపుతున్నారు కానీ జగన్...

October 03, 2020


img

ఈ నెల 6వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ అధ్యక్షతన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాగునీటిశాఖల ఉన్నతాధికారులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. దానిలో తాను పొరుగు రాష్ట్రం ఏపీకి, కేంద్రానికి గట్టిగా బుద్ధి చెపుతానని సిఎం కేసీఆర్‌ ‘లౌడ్ అండ్ క్లియర్’గానే చెపుతున్నారు. కోరుండి కయ్యలకు దిగుతున్న ఏపీ ప్రభుత్వం మళ్ళీ భవిష్యత్‌లో ఎన్నడూ తెలంగాణవైపు కన్నెత్తి చూడకుండా చేస్తానని సిఎం కేసీఆర్‌ చెపుతున్నారు. సిఎం కేసీఆర్‌ చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలు ఏపీ, తెలంగాణ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి కనుక ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన మంత్రులు, ఉన్నతాధికారులకు తెలియదనుకోలేము. 

కానీ సిఎం కేసీఆర్‌ చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, నేతలు, అధికారులు ఎవరూ కూడా ఇంతవరకు స్పందించలేదు. టిడిపి నేతలు చిన్న మాటంటే రెచ్చిపోయి తీవ్రస్థాయిలో విరుచుకుపడే వైసీపీ మంత్రులు, నేతలు తమ ప్రభుత్వం గురించి తెలంగాణ సిఎం కేసీఆర్‌ అంత తీవ్రంగా మాట్లాడుతున్నప్పటికీ కిమ్మనడంలేదు. అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం గురించి తెలంగాణలోనే తప్ప ఏపీలో అసలు ఆ ప్రస్తావనే వినబడటం లేదు. అంటే ఈసారి అపెక్స్ కౌన్సిల్‌ సమావేశాన్ని ఆఖరి నిమిషంలో ఏపీ ప్రభుత్వం వాయిదా వేయించబోతోందా?లేక సిఎం కేసీఆర్‌ వ్యాఖ్యలన్నీ దుబ్బాక ఉపఎన్నికల కోసమేనని భావిస్తోందా?అందుకే వాటిని పట్టించుకొనవసరం లేదని వైసీపీ భావిస్తోందా? లేక సిఎం కేసీఆర్‌ రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణపనులకు అడ్డుపడరని నమ్మకంగా ఉందా...తెలియదు. కానీ ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం మాత్రం అపెక్స్ కౌన్సిల్‌ సమావేశం విషయంలో చాలా నిశ్చింతగా ఉన్నట్లు కనబడుతోంది. కనుక ఈసారి అపెక్స్ కౌన్సిల్‌ సమావేశంలో ఏమి జరుగబోతోందో చాలా ఆసక్తికరంగా ఉంది.


Related Post