తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. కానీ ఆ సమయంలో కూడా రాష్ట్రాన్ని గడగడలాడించిన వ్యక్తి గ్యాంగ్‌స్టర్ నయీం. అతని ఎంకౌంటర్ తరువాత జరిగిన సిట్ విచారణలో పలువురు రాజకీయనేతలకు, పోలీస్ ఉన్నతాధికారులకు అతనితో దగ్గర సంబంధాలున్నాయని గుర్తించి వారిపై విచారణ జరిపింది. ఆ తరువాత కొంతకాలానికి నయీం కేసులు కూడా అటకెక్కిపోవడంతో నేటికీ వాటిలో దోషులెవరో…వారికి శిక్షలు పడ్డాయో లేదో... బాధితులకు న్యాయం జరిగిందో లేదో తెలీదు. ముఖ్యంగా నయీంతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొన్న రాజకీయ నాయకులు, పోలీస్ ఉన్నతాధికారులపై ఎటువంటి చర్యలు తీసుకొన్నారో తెలీదు.
ఆ కేసుల పురోగతి గురించి వివరాలు కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెస్ సిట్ బృందానికి నాయకత్వం వహిస్తున్న నాగిరెడ్డికి ఒక లేఖ వ్రాయగా ఆయన ఇవాళ్ళ సమాధానమిచ్చారు. వాటిలో నయీంతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ ఉన్నతాధికారులలో 25మందికి క్లినికల్ ట్రయల్స్ చిట్ ఇచ్చినట్లు తెలిపారు. వారికి నయీంతో ఎటువంటి సంబంధాలు లేవని సిట్ విచారణలో తెలినందున వారి పేర్లను ఆ జాబితాలో నుంచి తొలగించినట్లు నాగిరెడ్డి తెలిపారు. ఆ విధంగా క్లీన్ చిట్ పొందినవారిలో ఇద్దరు అడిషినల్ ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నట్లు నాగిరెడ్డి తెలిపారు.
దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవల గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఓ లేఖ రాసింది.నాలుగేళ్ళుగా ఈ కేసులపై సిట్ విచారణ జరుపుతున్నప్పటికీ ఇంతవరకు ఎవరినీ దోషులుగా నిరూపించి శిక్షలు పడేలా చేయలేకపోయిందని, బాధితులెవరికీ న్యాయం జరుగలేదని కనుక నయీం కేసులన్నీటీ సిబిఐకి అప్పగించాలని లేఖలో కోరింది. ఒకవేళ గవర్నర్ తమిళిసై సానుకూలంగా స్పందిస్తే తెలంగాణ ప్రభుత్వానికి, ఈ కేసులపై విచారణ జరుపుతున్న సిట్ బృందానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసిరావచ్చు.