అన్ని ఎన్నికలకు టిఆర్ఎస్‌ సై కానీ...

October 03, 2020


img

ఎన్నికలంటే టిఆర్ఎస్‌ ఎగిరిగంతేస్తుంటుంది. ఎన్నికలేవైనా సరే...ప్రతిపక్షాల కంటే ముందే టిఆర్ఎస్‌ సై అంటుంది. ఎన్నికలనగానే టిఆర్ఎస్‌లో కింద నుంచి పైవరకు అందరూ సమరోత్సాహంతో ఊగిపోతారు. వారి ఉత్సాహం చూసి ప్రతిపక్షాలు తడబడుతుంటాయి. ఇప్పుడూ అదే జరుగుతోంది. దుబ్బాక ఉపఎన్నికలు, శాసనమండలి, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ మునిసిపల్ ఎన్నికలలో ప్రతిపక్షాలను చిత్తుచిత్తుగా ఓడించి మళ్ళీ సత్తా చాటుకోవాలని టిఆర్ఎస్‌లో అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. ఎన్నికలంటే ఎగిరిగంతేసే టిఆర్ఎస్‌, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలంటే నీళ్ళు నములుతుండటం విశేషం. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈ ఏడాది ఏప్రిల్ 16తో ముగిసిపోయింది. అంటే ఇప్పటికి సుమారు 5 నెలలపైనే అన్నమాట. కానీ ఇంతవరకు ఎన్నికల ప్రస్తావన చేయడం లేదు టిఆర్ఎస్‌ ప్రభుత్వం! 

గత ఎన్నికలలో టిఆర్ఎస్‌ అనుబంద తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టిబిజికెఎస్) గెలిచింది. ఆ క్రెడిట్ పూర్తిగా ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు కవితదేనని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆమె స్వయంగా సింగరేణి అంతా కలియతిరిగి ఎన్నికల ప్రచారం చేసి అనేక హామీలు గుప్పించారు. కొత్త ఓపెన్ కాస్ట్, భూగర్భగనులు ప్రారంభించి వేల సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, న్యాయస్థానాలు అంగీకరించకపోయినా వేరేవిధంగానైనా కారుణ్య నియామకాలు చేపడతామని, కార్మికులు సొంత ఇళ్ళు నిర్మించుకోవడానికి వడ్డీలేని రుణాలు ఇస్తామని, కార్మికుల కుటుంబాలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్యసదుపాయం కల్పిస్తామని, ప్రతీ కార్మికుడి ఇంటికీ ఓ ఏసీ…అబ్బో ఇంకా చాలానే ఉన్నాయి. ఆమె సిఎం కేసీఆర్‌ కుమార్తె కావడంతో అవన్నీ ముఖ్యమంత్రి ఇస్తున్న హామీలుగానే భావించి సింగరేణి కార్మికులు టిబిజికెఎస్‌ను గెలిపించారు. కానీ నేటికీ వాటిలో చాలా హామీలు అమలుకాలేదు! పైగా కరోనా కష్టకాలంలో ప్రభుత్వంకానీ...టిబిజికెఎస్ గానీ తమను పట్టించుకోలేదని సింగరేణి కార్మికులు తీవ్ర ఆవేదన, ఆగ్రహంతో ఉన్నారు. ఇవికాక సింగరేణిలో అనేక సమస్యలు కూడా పేరుకుపోయున్నాయి. 

బహుశః అందుకే టిఆర్ఎస్‌ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రస్తావనే చేయడం లేదేమో? కానీ ఏదో ఓరోజు ఎన్నికలు జరిపించక తప్పదని టిఆర్ఎస్‌కు కూడా తెలుసు. కానీ ఆ రోజు ఎప్పుడో బహుశః టిఆర్ఎస్‌కు కూడా తెలుసో తెలియదో?


Related Post