అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఇద్దరికీ కరోనా సోకడంతో వైద్యుల సూచన మేరకు శుక్రవారం సాయంత్రం వాషింగ్టన్ సమీపంలోగల బెథెస్త్డాలోని వాల్టర్ రీడ్ మిలటరీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వైట్‌హౌస్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ట్రంప్ దంపతులు మిలటరీ ఆసుపత్రికి తరలివెళ్లారు.
తాము ఆసుపత్రిలో చేరుతున్నట్లు ట్రంప్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. తమ ఇరువురి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయని కానీ వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరుతున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆసుపత్రి నుంచే విధులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. అయితే మీడియాను కూడా కలిసేందుకు అవకాశం లేకపోవడం వలన ఎన్నికల ప్రచారానికి దూరం కావలసివస్తోంది.
చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ ప్రబలినప్పుడే ఆ విషయం డోనాల్డ్ ట్రంప్‌కు తెలుసు. అప్పుడు పట్టించుకోకపోయినా కరోనా వైరస్ చైనా నుంచి అమెరికాకు పాకుతోందని నిఘా సంస్థలు పదేపదే హెచ్చరించినప్పుడూ ట్రంప్ ఏమాత్రం పట్టించుకోలేదు. తత్ఫలితంగా అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగనివిధంగా లక్షలాదిమంది కరోనా బారినపడ్డారు. లక్షల మంది చనిపోయారు. ఆ తరువాత లాక్‌డౌన్... నిరుద్యోగం, దాంతో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులకు గురవడం వంటి అనేక అవాంఛనీయ పరిణామాలు జరిగాయి.
వీటన్నిటికీ చైనాయే బాధ్యత వహించాలని ట్రంప్ వాదిస్తున్నప్పటికీ, ఆయన నిర్లక్ష్యమే కొంప ముంచిందని చెప్పక తప్పదు. కరోనా తీవ్రతను గుర్తించిన తరువాత కూడా ట్రంప్ దాని గురించి చాలా తేలికగానే మాట్లాడారు. శాస్త్రవేత్తలు, వైద్యనిపుణులు మాత్రమే చెప్పవలసిన మాటలను ట్రంప్ చెప్పారు. హైడ్రోక్సీక్లోరోక్వీన్ మాత్రలు వేసుకొంటే కరోనా దరిచేరదని చెప్పడమే కాకుండా భారత్‌పై తీవ్ర ఒత్తిడి చేసి భారీగా రప్పించి దేశమంతటా పంపిణీ చేయించారు. అయితే వాటిని యదేచ్చగా వాడరాదని, వాడితే ప్రాణాలకే ప్రమాదామని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వైద్య నిపుణులు పదేపదే హెచ్చరించడంతో వాటిని మూలపడేశారు.
ఆ తరువాత కనీసం మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా తిరిగారు. సాక్షాత్ దేశాధ్యక్షుడే మాస్క్ ధరించకుండా తిరుగుతూ మాస్క్ అవసరంలేదని చెపుతుంటే ఆయన చుట్టూ ఉన్నవారు, ప్రజలు మాత్రం ఎందుకు ధరిస్తారు? కనుక అమెరికాలో కరోనా కేసులు పెరిగిపోవడానికి ఇదీ ఓ కారణమని భావించవచ్చు.
ట్రంప్ తాను మాస్క్ ధరించకపోగా మాస్క్ ధరించి భౌతికదూరం పాటిస్తున్న తన ప్రత్యర్ధి జో బిడెన్‌ను “ప్రజలకు దూరంగా ఉంటారని” ఎగతాళి చేశారు. చివరికి తనకే కరోనా సోకడంతో మాస్క్ ధరించి ఆసుపత్రిలో చేరి వైద్యులు సూచించిన విధంగా మందులు మింగవలసి వస్తోంది.
ఒక దేశానికి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి దేశప్రజలకు ఆదర్శంగా, మార్గదర్శకుడిగా ఉండాలని ఆశించడం సహజం. కానీ డోనాల్డ్ ట్రంప్ కరోనా విషయంలో ప్రతీ దశలోనూ ఈవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి దేశానికి, ప్రజలకు చివరికి తనకు తాను చేజేతులా కష్టాలు కొని తెచ్చిపెట్టుకొన్నారు. ఆసుపత్రి పాలవడం వలన డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండవలసి వస్తోంది. ఒకవేళ ఈ కారణంగా ట్రంప్ ఎన్నికలలో ఓడిపోయినట్లయితే తన నిర్లక్ష్యానికి చాలా భారీ మూల్యమే చెల్లించుకొన్నట్లవుతుంది కదా?